కోరుకున్నట్టుగా హెల్త్‌ పాలసీ: బజాజ్‌ అలియాంజ్‌ ఆఫర్‌

Bajaj Allianz Launches Customisable Health Policy - Sakshi

ముంబై: హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ను తమకు కావాల్సిన సేవలతోనే తీసుకునే విధంగా ‘మై హెల్త్‌కేర్‌ ప్లాన్‌’ను బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఆవిష్కరించింది. మోటారు వాహన ఇన్సూరెన్స్‌ను నడిపినంత దూరానికే తీసుకునే విధంగా ఇటీవలే కొత్త తరహా ప్లాన్లు అందుబాటులోకి రావడం తెలిసిందే. ఇదే మాదిరిగా హెల్త్‌ ఇన్సూరెన్స్‌లోనూ కొత్త తరహా సేవలతో బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ముందుకు వచ్చింది. కస్టమర్లు తమకు కావాల్సిన కవరేజీ ఎంపిక చేసుకోవచ్చని, వాటి ప్రకారం ప్రీమియం ఖరారు అవుతుందని సంస్థ తెలిపింది.

హాస్పిటల్‌లో ఇన్‌ పేషెంట్‌గా చేరినప్పుడు అయ్యే వ్యయాలు, హాస్పిటల్‌లో చేరడానికి ముందు, డిశ్చార్జ్‌ అయిన తర్వాత అయ్యే వ్యయాలు, మేటర్నిటీ వ్యయాలు, ఎయిర్‌ అంబులెన్స్‌ సేవలు, అధునాతన చికిత్సా విధానాలు, అవయవ దాత వ్యయాలు, ఆయుర్వేదిక్, హోమియోపతీ సేవల కవరేజీ తీసుకోవచ్చు. బేబీ కేర్‌ కవరేజీ కూడా అందుబాటులో ఉంది. ఒక ఏడాదికి చెల్లించే ప్రీమియానికి రెట్టింపు విలువ మేర.. అవుట్‌ పెషెంట్‌ కవరేజీ కూడా ఈ ప్లాన్‌లో భాగంగా ఉంటుంది. ప్రమాదాలు, తీవ్ర వ్యాధులు, ఆదాయం నష్టం వంటి సందర్భాల్లో అదనపు పరిహారానికి సంబంధించిన రైడర్లను సైతం ఈ ప్లాన్‌తోపాటు తీసుకోవచ్చు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top