‘బచ్‌పన్‌ కా ప్యార్‌’ పిలగాడు: బతికి బట్ట కట్టాడు.. ఈసారి అదృష్ట దేవత మరో రూపంలో..

Bachpan ka Pyaar Kid Sahdev Dirdo Recovered And Rolls Out His NFTs - Sakshi

జీవితంలో  ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఒక్కోసారి అదృష్టం, మరోసారి దురదృష్టం వెంటాడడం సహజమే!. పదేళ్ల వయసున్న సహదేవ్‌ దిర్డో విషయంలో ఇలాంటిదే జరుగుతోంది. ఒక వైరల్‌ వీడియోతో సెన్సేషన్‌ అయిన ఈ గిరిజన కుర్రాడికి.. బాలీవుడ్‌లో పాప్‌ సాంగ్స్‌ చేసే అదృష్టం దక్కింది. ఆ వెంటనే రోడ్డు ప్రమాదం చావు అంచుల దాకా తీసుకెళ్లింది. మరి ఇప్పుడో..?

‘జానే మేరీ జానేమన్‌ బచ్‌పన్‌ కా ప్యార్‌  మేరా భూల్‌ నహీ జానా రే’ అంటూ స్కూల్‌ యూనిఫామ్‌లో తరగతి గదిలో హుషారుగా పాట పాడిన సహదేవ్‌ దిర్డో.. ఏడాది తర్వాత(2021లో) కరోనా టైంలో ఆ వీడియో వైరల్‌ అవ్వడంతో ఇంటర్నెట్‌ సెలబ్రిటీ అయిపోయాడు. ఆ రాష్ట్ర సీఎం, సెలబ్రిటీలంతా ఆ వీడియోపై రియాక్ట్‌ అయ్యారు. లగ్జరీ కారుతో పాటు కొంత ఆర్థిక సాయం కూడా అందింది ఆ కుర్రాడికి.  సుక్మాలో అతని చిన్న ఇంటికి నేషనల్‌ మీడియా సైతం క్యూ కట్టింది. ఇది ఇక్కడితోనే ఆగలేదు. బాలీవుడ్‌ ర్యాపర్‌ బాద్‌షాతో కలిసి ఏకంగా తన వైరల్‌ సాంగ్‌కు ర్యాప్‌ కట్టాడు సహదేవ్‌. ఆ దెబ్బతో అతని జీవితం మారిపోయిందని అంతా భావించారు. కానీ.. 

కిందటి నెలలో తన తండ్రితో కలిసి బైక్‌ మీద వెళ్తున్న క్రమంలో జారి కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో బతకడం కష్టమని ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు భావించారు. కానీ, ఆ పిలగాడి నసీబ్‌ మంచిగుంది. బతికి బట్టకట్టాడు. సహదేవ్‌కు బాద్‌షా వెన్నంటే ఉన్నాడు.  ఆరోగ్య స్థితిపై ఎప్పటికప్పుడు ట్విటర్‌ ద్వారా తెలియజేస్తూ వచ్చాడు. ఆపై కోలుకున్న అతన్ని రాయ్‌పూర్‌లోని మంచి న్యూరోసర్జన్‌ దగ్గరికి తీసుకెళ్లి కోలుకునేలా చేశాడు ఈ బాలీవుడ్‌ ర్యాపర్‌. 

ఆ రూపంలో లక్‌
తన ప్రాణాలు నిలబెట్టిన వైద్యులకు కృతజ్ఞతలు చెప్తూ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో స్వయంగా ఓ వీడియో సందేశం పోస్ట్‌ చేశాడు సహదేవ్‌. అంతేకాదు తన క్షేమసమాచారాల కోసం ఆరా తీసిన వాళ్లకు, తాను కోలుకోవాలని ఆకాంక్షినవాళ్లకు కృతజ్ఞతలు సైతం తెలియజేశాడు. అంతేకాదు కొత్తగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టబోతున్నానంటూ మరో వీడియోను పోస్ట్‌ చేశాడు. సెలబ్రిటీల ఎన్‌ఎఫ్‌టీ మార్కెట్‌ ప్లేస్‌ అయిన ఎన్‌వోఎఫ్‌టీఈఎన్‌(nOFTEN) వెంచర్‌లో భాగం కానున్నట్లు ప్రకటించాడు. ఇది మన దేశంలో సెలబ్రిటీల కోసం ఏర్పాటు చేసిన మెటావర్స్‌ మార్కెట్‌ప్లేస్‌. ఈ ఎన్‌ఎఫ్‌టీలో ఒరిజనల్‌ సాంగ్‌కు చెందినదంతా ఉంటుంది. తద్వారా సహదేవ్‌కు కాసుల వర్షం కురవడంతో పాటు అమితాబ్‌లాంటి ప్రముఖుల సరసన నిలిచే అదృష్టం కలిగింది(ఎన్‌ఎఫ్‌టీ ద్వారా).

ర్యాప్‌ సాంగ్‌ ఒరిజినల్‌ సాంగ్‌తోపాటు బిహైండ్‌ సీన్స్‌, షార్ట్‌ మూవీస్‌.. ఇలా ఎన్నో ఉంటాయి. వీటిని కొనుగోలు చేసి.. ఎన్‌వోఎఫ్‌టీఈఎన్‌లో మంచి ధర ఆఫర్‌ అయినప్పుడు అమ్మేసుకోవచ్చు. మొదటి మార్గంగా ప్రాధాన్యత ప్రకారం వారి కళాకృతులను చేర్చుకోవడం,  వారి డిజిటల్ భాగాన్ని వేలం వేయడానికి సులభమైన బిడ్డింగ్ విధానం ద్వారా వారి భాగానికి సరైన ధరను పొందడం. రెండో మార్గం క్రియేటర్‌లు ఈ ప్లాట్‌ఫారమ్‌లో స్థిరమైన ధర పాయింట్‌ను జోడించడం ద్వారా ఆసక్తి ఉన్నవాళ్లకు అమ్మేసి డబ్బు సంపాదించవచ్చు, 

ఇదిలా ఉంటే హెల్మెట్‌ ధరించనందువల్లే తాను గాయపడ్డానని, దయచేసి అందరూ హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలంటూ స్థానిక మీడియా హౌజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైతం వ్యాఖ్యానించాడు సహదేవ్‌. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top