Auto Expo 2023: మూడేళ్ల విరామం.. మళ్లీ కనువిందు చేయనున్న ఆటో ఎక్స్‌పో!

Auto Expo 2023: Indias Biggest Motown Event Starts From January - Sakshi

న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ ఎక్స్‌పో దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఈ ఏడాది మళ్లీ కనువిందు చేయనుంది. జనవరి 11న ప్రారంభం కానుంది. 11–12 తేదీల్లో మీడియాకు, 13–18 వరకు సందర్శకులకు అనుమతి ఉంటుంది. రెండేళ్లకోసారి జరిగే ఆటో ఎక్స్‌పో వాస్తవానికి 2022లో నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కరోనా మహమ్మారి పరిస్థితుల కారణంగా నిర్వహించలేదు. ఈసారి షోలో మారుతి సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్, కియా ఇండియా, టయోటా కిర్లోస్కర్, ఎంజీ మోటర్‌ ఇండియా తదితర సంస్థలు పాల్గోనున్నాయి.

అలాగే కొత్త అంకుర సంస్థలు.. ప్రధానంగా ఎలక్ట్రిక్‌ వాహనాల సంస్థలు కూడా వీటిలో ఉండబోతున్నాయి. అయిదు అంతర్జాతీయ లాంచింగ్‌లతో పాటు 75 పైచిలుకు కొత్త ఉత్పత్తులను ఇందులో ఆవిష్కరించనున్నారు. 2020 ఎడిషన్‌తో పోలిస్తే ఈసారి అత్యధికంగా 46 వాహన తయారీ కంపెనీలతో పాటు 80 పైగా సంస్థలు పాల్గొంటున్నట్లు ఆటోమొబైల్‌ తయారీ సంస్థల సమాఖ్య సియామ్‌ తెలిపింది.  

కొన్ని కంపెనీలు దూరం..
ఈసారి ఆటో షోలో కొన్ని సంస్థలు పాల్గొనడం లేదు. మహీంద్రా అండ్‌ మహీంద్రా, స్కోడా, ఫోక్స్‌వ్యాగన్, నిస్సాన్‌.. లగ్జరీ కార్ల తయారీ కంపెనీలు మెర్సిడెస్‌–బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి మొదలైనవి వీటిలో ఉన్నాయి. అటు హీరో మోటోకార్ప్, బజాజ్‌ ఆటో, టీవీఎస్‌ మోటర్‌ వంటి ప్రధాన ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలు కూడా కేవలం ఫ్లెక్స్‌ ఫ్యుయల్‌ ప్రొటోటైప్‌ వాహనాలకే పరిమితం కానున్నాయి.

తమలాంటి లగ్జరీ బ్రాండ్స్‌పై ఆసక్తి ఉండే కస్టమర్లు ఈ తరహా ఆటో ఎక్స్‌పోలకు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటున్నాయని గమనించిన నేపథ్యంలో ఈసారి షోలో పాల్గొనరాదని నిర్ణయించుకున్నట్లు మెర్సిడెస్‌–బెంజ్‌ ఇండియా ఎండీ సంతోష్‌ అయ్యర్‌ తెలిపారు. దానికి బదులుగా కస్టమర్లకు మరింత మెరుగైన అనుభూతిని అందించడంపై దృష్టి పెడుతున్నట్లు ఆయన వివరించారు. అటు స్కోడా ఆటో ఇండియా బ్రాండ్‌ డైరెక్టర్‌ పీటర్‌ సోల్చ్‌ కూడా భారత్‌లో కొత్త ఆవిష్కరణలను ప్రవేశపెట్టడంపైనే ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. వేదిక చాలా దూరంగా ఉండటం, వ్యయాలు తడిసి మోపెడవుతుండటం వంటి అంశాలు ఆటో షోలో పాల్గొనడానికి ప్రతికూలాంశాలుగా ఉంటున్నాయని గతంలో పలు ఆటోమొబైల్‌ తయారీ సంస్థలు తెలిపాయి.

చదవండి: రైల్వే శాఖ కీలక నిర్ణయం: ప్రయాణం చేసేటప్పుడు అలా చేస్తే చిక్కుల్లో పడినట్లే!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top