AU Small Finance Bank Net Profit Jumps 44 Percent to Rs 387 Crore - Sakshi
Sakshi News home page

ఏయూ బ్యాంక్‌ లాభం రూ.387 కోట్లు

Published Mon, Jul 24 2023 6:08 AM

AU Small Finance Bank net profit jumps 44percent to Rs 387 crore - Sakshi

ముంబై: జైపూర్‌ కేంద్రంగా పనిచేసే ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో మెరుగైన పనితీరు చూపించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 44 శాతం వృద్ధి చెందిన రూ.387 కోట్లుగా నమోదైంది. ఆదాయం సైతం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు రూ.1,979 కోట్ల నుంచి రూ.2,773 కోట్లకు పెరిగింది.

నికర వడ్డీ ఆదాయం 28 శాతం వృద్ధితో రూ.1,246 కోట్లకు చేరుకుంది. కానీ, నికర వడ్డీ మార్జిన్‌ క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో 5.9 శాతంగా ఉంటే, తాజాగా సమీక్షా త్రైమాసికంలో 5.7 శాతానికి పరిమితమైంది. డిపాజిట్లను ఆకర్షించేందుకు ఎక్కువ వడ్డీ రేటును ఆఫర్‌ చేయడమే, నికర వడ్డీ మార్జిన్‌ క్షీణతకు దారితీసినట్టు బ్యాంక్‌ సీఈవో సంజయ్‌ అగర్వాల్‌ తెలిపారు. సేవింగ్స్, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై రేట్లను తగ్గించినా కానీ, రానున్న రోజుల్లో నికర వడ్డీ మార్జిన్‌పై ఒత్తిడి ఉంటుందని స్పష్టం చేశారు. డిపాజిట్ల సమీకరణ విషయంలో బ్యాంక్‌ల మధ్య పోటీ మొదలైనట్టు అంగీకరించారు.

నిధుల వ్యయాలు 5.96 శాతం నుంచి 6.58 శాతానికి పెరిగిపోవడంతో, డిపాజిట్లపై రేట్లను తగ్గించక మరో దారి లేదన్నారు. దీంతో పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర వడ్డీ మార్జిన్‌ 5.5–5.7 శాతానికి తగ్గొచ్చని చెప్పారు. క్రెడిట్‌ కార్డ్‌ల రుణ పుస్తకం రూ.1,000 కోట్లను దాటిందని, ఈ విభాగంలో భవిష్యత్తులో బలమైన వృద్ధిని చూడనునున్నట్టు చెప్పారు. రుణాలు 29 శాతం పెరిగి రూ.63,635 కోట్లకు చేరాయి. స్థూల ఎన్‌పీఏలు 1.76 శాతానికి తగ్గగా, నికర ఎన్‌పీఏలు 0.55 శాతానికి పరిమితమయ్యాయి.  

Advertisement
Advertisement