బెరైటీస్‌ ఎగుమతుల్లో ఏపీఎండీసీ రికార్డ్‌.. అమెరికా మార్కెట్‌లో 44 శాతం వాటా

APMDC earns Rs 1300 crore from barytes exports 44 pc share in america market - Sakshi

బెరైటీస్‌ ఎగుమతుల్లో ఏపీఎండీసీ (ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ) సరికొత్త రికార్డు సృష్టించింది. అమెరికా బెరైటీస్‌ మార్కెట్‌లో 44 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఈ మేరకు అంతర్జాతీయ బెరైటీస్‌ అసోసియేషన్‌ ఇటీవల వెల్లడించింది.

అమెరికా మార్కెట్‌లో ఒక దేశం గానీ, సంస్థ గానీ ఇంత శాతం వాటాను చేజిక్కించుకోవడం ఇదే తొలిసారి. గత సంవత్సరం 30 శాతం వాటాను దక్కించుకున్న ఏపీఎండీసీ.. ఈ సంవత్సరం దాన్ని మరో 14 శాతం పెంచుకుని ప్రపంచ మార్కెట్‌లో సుస్థిర స్థానం సాధించింది. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం 3 మిలియన్‌ టన్నుల బెరైటీస్‌ ఉత్పత్తి లక్ష్యాన్ని పెట్టుకున్న ఏపీఎండీసీ  దాన్ని సాధించింది. గత సంవత్సరం బెరైటీస్‌పై ఏపీఎండీసీకి రూ.900 కోట్ల ఆదాయం రాగా ఈ ఏడాది అది రూ.1,300 కోట్లకు పెరిగింది. 

మంగంపేటలో విస్తారంగా బెరైటీస్‌..
బెరైటీస్‌ నిక్షేపాలు ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా మంగంపేటలో విస్తారంగా ఉన్నాయి. చమురు, సహజవాయువుల రంగానికి బెరైటీస్‌ అత్యంత కీలకం కావడం, అతి తక్కువ దేశాల్లో మాత్రమే ఇది దొరకడంతో అంతర్జాతీయంగా దీనికి డిమాండ్‌ ఉంది. భారత్‌లో ఉన్న బెరైటీస్‌ నిక్షేపాల్లో 98 శాతం మంగంపేటలోనే ఉన్నాయి. ఇక్కడ 74 మిలియన్‌ టన్నుల నిల్వలున్నాయి. ఇక్కడి నుంచి సుమారు 30 దేశాలకు బెరైటీస్‌ ఎగుమతి అవుతోంది. ఇప్పటి వరకు ఇక్కడ 40 మిలియన్‌ టన్నుల బెరైటీస్‌ ఖనిజాన్ని వెలికితీశారు.

బెరైటీస్‌ను ఎందుకు వాడతారంటే..
బెరైటీస్‌ ఖనిజాన్ని అనేక ఉత్పత్తులో ఉపయోగిస్తారు. ముఖ్యంగా పెయింట్, ప్లాస్టిక్‌లలో పూరకం, ఇంజన్ కంపార్ట్‌మెంట్లలో సౌండ్ తగ్గించడానికి, ఆటోమొబైల్ ఉత్పత్తులో నునుపు, తుప్పు నిరోధకత కోసం వినియోగిస్తారు. అలాగే ట్రక్కులు, ఇతర వాహనాల్లో ఘర్షణ కలిగించే ఉత్పత్తులు, రేడియేషన్ షీల్డింగ్ కాంక్రీటు, గ్లాస్ సిరామిక్, వైద్య ఉత్పత్తుల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top