
అంతర్జాతీయ పెట్టుబడులకు భారత్ కేంద్రం
నైపుణ్య సేవల ఎగుమతులకు చిరునామా
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలపై విశ్లేషకుల స్పందన
న్యూఢిల్లీ: భారత్ ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అంటూ ఒకవైపు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ తదితర పేరున్న సంస్థలు కీర్తిస్తుంటే.. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం భారత ఆర్థిక వ్యవస్థను ‘డెడ్ ఎకానమీ’ (నిర్వీర్యమైనది)గా అభివర్ణిస్తూ నోరు పారేసుకున్నారు. కాకపోతే ఈ వ్యాఖ్యలు తప్పుగా ఉచ్చరించడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విదేశీ పెట్టుబడులకు భారత్ ఎంతో ఆకర్షణీయ కేంద్రంగా ఉండడమే కాకుండా.. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు భారత్‌లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల (జీసీసీలు) ఏర్పాటుకు క్యూ కడుతుండడాన్ని గుర్తు చేశారు.
భారత్ ఉత్పత్తులపై ఆగస్ట్ 1 నుంచి 25 శాతం టారిఫ్‌లకు అదనంగా పెనాల్టిలను విధిస్తామంటూ ప్రకటించిన మర్నాడే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ‘‘రష్యాతో భారత్ ఏం చేసినా నాకు అవసరం లేదు. నిర్వీర్యమైన తమ ఆర్థిక వ్యవస్థలను (డెడ్ ఎకానమీస్) అవి పరస్పరం మరింత దిగజార్చుకుంటుండడంపైనే నా దృష్టి అంతా’’అని పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనిపై కన్సల్టెన్సీ సంస్థ ఈవై ఇండియా స్పందిస్తూ.. భారత్‌పై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తప్పుగా దొర్లినట్టుగా పేర్కొంది.
ఇండియానే ఆధారం..
‘‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గ్లోబల్ సౌత్ ప్రధానంగా మారుతోంది. ఇందులో భారత్ కీలకమైన పాత్ర పోషిస్తోంది. మరోవైపు అభివృద్ధి చెందిన ఒకప్పటి ఆర్థిక వ్యవస్థలు వేగంగా ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. భారత సంతతి వారి కృషి మూలంగానే ఆయా ఆర్థిక వ్యవస్థలు ఎంతో కొంత సానుకూల వృద్ధిని చూపించగలుగుతున్నాయి’’అని ఈవై ఇండియా ముఖ్య విధాన సలహాదారుడు డీకే శ్రీవాస్తవ తెలిపారు. అధిక యువ జనాభా కలిగిన భారత ఆర్థిక వ్యవస్థ ఎంతో చురుకైన, చైతన్యవంతమైనదిగా పేర్కొన్నారు.
ఐక్యరాజ్యసమితి 2024 గణాంకాల ప్రకారం భారత్‌లో సగటు వయసు 28.8 సంవత్సరాలు కాగా, అమెరికాలో ఇది 38.5, యూరప్‌లో 42.8 సంవత్సరాలుగా ఉంది. సగటు వయసు, వృద్ధి అవకాశాల పరంగా అభివృద్ది చెందిన దేశాలు మరింత వృద్ధాప్యంలోకి చేరుతున్నట్టు శ్రీవాస్తవ అన్నారు. ఐఎంఎఫ్ ఒక రోజు ముందే భారత ఆర్థిక వృద్ధి అంచనాలను పెంచుతూ ప్రకటించడం గమనార్హం. 2025, 2026 సంవత్సరాల్లో జీడీపీ 6.4 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేస్తుందని తెలిపింది. ఈ ఏడాదికి గాను భారత్ 6.3 శాతం వృద్ధి చెందుతుందని ప్రపంచ బ్యాంక్ ప్రకటించగా, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) 6.5 శాతంగా అంచనా వేసింది. పారిస్ కేంద్రంగా పనిచేసే ఆర్థిక సహకార, అభివృద్ధి సమాఖ్య (ఓఈసీడీ) సైతం భారత్‌కు సంబంధించి మెరుగైన అంచనాలను ప్రకటించడం తెలిసిందే.