షాపుల ముందు తగ్గుతున్న ‘క్యూ’లు.. జోరందుకున్న ఆన్‌లైన్‌ ఆర్డర్లు

Amid Omicron Third Wave Fears Online Orders Jump In ECommerce Portals - Sakshi

లక్ష కొత్త కేసుల నమోదుతో  భారత్‌ కరోనా మూడో వేవ్‌లోకి ప్రవేశించిందన్న సంకేతాలు మొదలయ్యాయి. భారీగా పెరిగిపోతున్న కేసులు.. మరోవైపు ఒమిక్రాన్‌ భయాందోళనలు, టైం పరిమితుల నడుమ ఫిజికల్‌ స్టోర్‌ల ముందు క్యూ కట్టే జనం తగ్గిపోతున్నారు. ఈ క్రమంలో ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లలో అమ్మకాలు జోరందుకున్నాయి. 

ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌లో నిత్యావసరాల అమ్మకాలు గత వారం రోజులుగా జోరుగా నడుస్తున్నాయి. కొత్త సంవత్సరం మొదటి రోజు నుంచే ఒమిక్రాన్‌ ఫియర్‌తో పాటు ప్రభుత్వ ఆంక్షలు, వారాంతపు కర్ఫ్యూ-లాక్‌డౌన్‌ల నేపథ్యంలో ప్రజలు షాపుల ముందు క్యూ కట్టేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఈ క్రమంలో నిత్యావసరాలు, ప్యాకేజ్డ్‌ ఫుడ్‌,  సబ్బుల ఇతరత్రాల అమ్మకాలు ఆన్‌లైన్‌ ఆర్డర్‌ల రూపంలో పెరిగిపోతున్నాయి.


మరోసారి ప్రభుత్వాల ఆంక్షలతో ఫిజికల్‌ ఎకానమీ యాక్టివిటీకి అవాంతరం ఎదురుకాగా.. ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు మళ్లీ ఈ-కామర్స్‌ ఛానెల్స్‌ ముందుకు వచ్చాయి. అమెజాన్‌ ఇండియాతో పాటు బిగ్‌బాస్కెట్‌, బ్లింకిట్‌, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లలో డిమాండ్‌ ఇప్పటికే మొదలైంది. కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ విధించే ఆస్కారం ఉందన్న అనుమానంతో నిల్వలకు సిద్ధపడుతున్నారు మరికొందరు. గత వారంలోనే 10 నుంచి 15 శాతం పెరుగుదల కనిపిస్తోందని ఆయా ప్లాట్‌ఫామ్స్‌ ప్రకటించుకున్నాయి.  

ఇక ఈ వారం వ్యవధిలో దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో ఎక్కువగా డిమాండ్‌ ఉంటున్న ఉత్పత్తులు చాక్లెట్‌, శీతల పానీయాలకు సంబంధించినవి కావడం విశేషం.


హైజీన్‌ ఉత్పత్తులు కూడా
రెండో వేవ్‌ ఉధృతి తగ్గాక ఊసే లేకుండా పోయిన హైజీన్‌ ఉత్పత్తులకు మళ్లీ టైం మొదలైంది. శానిటైజర్లు, హ్యాండ్‌ వాష్‌లు, క్లీనింగ్‌ లిక్విడ్స్‌, డిస్‌ఇన్‌ఫెక్టెడ్‌ సొల్యూషన్స్‌, ఎన్‌95 మాస్కులు, ఇతర మాస్కులకు డిమాండ్‌ మొదలైంది.  ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌తోనే ఈ ఊపు వస్తోందని తయారీ కంపెనీలు భావిస్తున్నాయి.  ఈ నేపథ్యంలో డిమాండ్‌కు తగ్గట్లు సప్లయి కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి.

మెట్రో సిటీ, సిటీ, టౌన్‌లలో ఆన్‌లైన్‌ ఆర్డర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలను, ప్రజల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకోకుండా ఈ నివేదికను ఈ-కామర్స్‌ పోర్టల్స్‌ వెల్లడించాయని గమనించగలరు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top