భారత్‌లో శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌! రంగంలోకి అమెజాన్‌...

Amazon Eyes Satellite Internet Space In India - Sakshi

అందుబాటులోకి తేవడంపై  అమెజాన్‌ కసరత్తు 

ప్రభుత్వ శాఖలతో భేటీ యోచన 

విధివిధానాలు, పర్మిట్లపై   చర్చించే అవకాశం 

న్యూఢిల్లీ: అత్యంత వేగవంతమైన ఉపగ్రహ ఇంటర్నెట్‌ సర్వీసులను భారత్‌లో అందుబాటులోకి తేవడంపై ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన విధివిధానాలు, అనుమతులపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వంతో భేటీ అయ్యే యోచనలో కంపెనీ ఉన్నట్లు సమాచారం. ల్యాండింగ్‌ హక్కులు, శాటిలైట్‌ బ్యాండ్‌విడ్త్‌ లీజింగ్‌ వ్యయాలు తదితర అంశాలపై డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌ (డీవోఎస్‌), టెలికం శాఖ (డాట్‌)లతో సమావేశాల్లో చర్చించే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. క్విపర్‌ పేరిట చేపట్టిన శాటిలైట్‌ ఇంటర్నెట్‌ ప్రాజెక్టులో భాగంగా 3,236 పైచిలుకు ’లో ఎర్త్‌ ఆర్బిట్‌’ (ఎల్‌ఈవో) ఉపగ్రహాలపై అమెజాన్‌ దాదాపు 10 బిలియన్‌ డాలర్లు వెచ్చిస్తోంది. వీటి ద్వారా అంతర్జాతీయంగా ఈ తరహా వేగవంతమైన ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది. అయితే, అధికారికంగా ఇప్పటిదాకా భారత్‌ ప్రణాళికలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు.  

కీలక మార్కెట్‌గా భారత్‌.. 
గణాంకాల ప్రకారం దేశీయంగా దాదాపు 75 శాతం మంది గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులు అందుబాటులో లేవు. చాలా మటుకు ప్రాంతాలకు సెల్యులార్‌ లేదా ఫైబర్‌ కనెక్టివిటీ లేకపోవడమే ఇందుకు కారణం. దీంతో ఎల్‌ఈవో శాటిలైట్‌ సిస్టమ్స్‌ ద్వారా ఇంటర్నెట్‌ సేవలు అందించే సంస్థలకు భారత మార్కెట్లో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు తెలిపారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని లక్షల మందికి ఈ తరహా సేవలు అందించడం ద్వారా సమీప భవిష్యత్తులో దాదాపు 500 మిలియన్‌ డాలర్ల మేర ఆదాయాల ఆర్జనకు అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత మార్కెట్‌ను అమెజా న్‌ పక్కన పెట్టే పరిస్థితి ఉండబోదని తెలిపారు.  

ఒంటరిగానా లేదా జట్టుగానా.. 
మిగతా శాటిలైట్‌ ఇంటర్నెట్‌ కంపెనీల వైఖరి ఇప్పటికే స్పష్టం కావడంతో అమెజాన్‌ ఎలా ముందుకెళ్తుందన్న అంశంపై అందరి దృష్టి ఉంది. ఒంటరిగా రంగంలోకి దిగుతుందా లేదా ఇతరత్రా ఏదైనా సంస్థతో జట్టు కడుతుందా అన్నది ఆసక్తిగా మారింది. వన్‌వెబ్‌లో భారతి గ్రూప్‌ ఇప్పటికే భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో ఇక మిగిలింది రెండు టెలికం సంస్థలు.. ఒకటి జియో కాగా రెండోది.. వొడాఫోన్‌ ఐడియా. అయితే, ఫ్యూచర్‌ గ్రూప్‌ రిటైల్‌ వ్యాపారాల కొనుగోలుపై రిలయన్స్‌తో అమెజాన్‌ న్యాయపోరాటం చేస్తోంది. కాబట్టి దానితో జట్టు కట్టే అవకాశాలపై సందేహాలు నెలకొన్నాయి.

వన్‌వెబ్‌..స్పేస్‌ఎక్స్‌తో పోటీ
అంతర్జాతీయంగా ఎల్‌ఈవో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలందించడంలో ఎలక్ట్రిక్‌ కార్ల దిగ్గజం టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్‌కి చెందిన స్పేస్‌ఎక్స్‌తోను, దేశీ టెలికం దిగ్గజం భారతి గ్రూప్‌.. బ్రిటన్‌ ప్రభుత్వం కలిసి నెలకొల్పిన వన్‌వెబ్‌తోనూ అమెజాన్‌ పోటీపడాల్సి రానుంది. ఈ రెండు సంస్థలూ ఇప్పటికే భారత మార్కెట్‌పై తమ ప్రణాళికలను ప్రకటించేశాయి. వచ్చే ఏడాదే కార్యకలాపాలు ప్రారంభించేం దుకు కూడా సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఇక అమెజాన్‌ కూడా రంగంలోకి దిగితే పోటీ మరింత పెరుగుతుందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. దీనివల్ల రేట్లు కూడా తగ్గగలవని పేర్కొన్నాయి. ప్రస్తుతం 4జీ మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌తో పోలిస్తే శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల చార్జీలు చాలా అధికంగా ఉంటున్నాయి. మొబైల్‌ డేటా చార్జీ జీబీకి 0.68 డాలర్లుగా ఉంటే.. శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ చార్జీలు జీబీకీ 15–20 డాలర్ల దాకా ఉంటున్నాయి. వన్‌వెబ్, స్పేస్‌ఎక్స్, అమెజాన్‌ల రాకతో ఆరోగ్యవంతమైన పోటీ నెలకొనగలదని,  సేవ లు మరింత చౌకగా లభించగలవని అంచనా.

స్పేస్‌ఎక్స్‌ బీటా వెర్షన్‌.. 
స్పేస్‌ఎక్స్‌ ప్రస్తుతం భారత్‌లో యూజర్లకు తమ స్టార్‌లింక్‌ శాటిలైట్‌ సర్వీసును బీటా వెర్షన్‌లో అందించేందుకు ప్రీ–ఆర్డర్లు తీసుకుంటోంది. ఇందుకోసం రిఫండబుల్‌ డిపాజిట్‌ 99 డాలర్లు (సుమారు రూ. 7,200)గా ఉంది. వన్‌వెబ్‌ ప్రధానంగా మారుమూల ప్రాంతాలకు శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులపై దృష్టి పెడుతుండగా.. స్టార్‌లింక్‌ ఇటు పట్టణ ప్రాంతాలకు కూడా మరింత వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించాలని యోచిస్తోంది. తగినన్ని మొబైల్‌ టవర్లు, ఫైబర్‌ నెట్‌వర్క్‌ ఉండని గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్‌ కవరేజీని పెంచేందుకు శాటిలైట్‌ సర్వీసులు తోడ్పడగలవని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. సరఫరా వ్యవస్థ, కోల్డ్‌ చెయిన్‌ల నిర్వహణ మొదలుకుని విద్యుత్‌ పంపిణీకి సంబంధించిన స్మార్ట్‌ గ్రిడ్స్‌ నిర్వహణ, వరదలు..సునామీల సమయంలో అత్యవసర హెచ్చరికల జారీ తదితర అవసరాలకు ఇవి ఉపయోగపడగలవని వివరించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top