ఫ్యూచర్‌ డీల్‌పై సుప్రీం కోర్టుకు అమెజాన్‌ | Amazon challenges Delhi  HC order  in Supreme Court | Sakshi
Sakshi News home page

ఫ్యూచర్‌ డీల్‌పై సుప్రీం కోర్టుకు అమెజాన్‌

Apr 9 2021 4:47 AM | Updated on Apr 9 2021 4:47 AM

Amazon challenges Delhi  HC order  in Supreme Court - Sakshi

న్యూఢిల్లీ: ఫ్యూచర్‌ గ్రూప్‌–రిలయన్స్‌ డీల్‌ వివాదంపై ఈ–కామర్స్‌ సంస్థ అమెజాన్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ ఒప్పందానికి సంబంధించిన స్టేను ఎత్తివేస్తూ ఢిల్లీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ మార్చి 22న ఇచ్చిన ఆదేశాలను సవాలు చేసింది. ఈ వివాదంపై తాము గతంలో వేసిన పిటిషన్‌ మీద తుది ఉత్తర్వులు వచ్చేదాకా డివిజన్‌ బెంచ్‌ ఆదేశాలపై స్టే విధించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసింది. వివరాల్లోకి వెడితే .. కరోనా వైరస్‌పరమైన ప్రతికూల పరిణామాలతో సంక్షోభంలో చిక్కుకున్న ఫ్యూచర్‌ గ్రూప్‌ తమ ఫ్యూచర్‌ రిటైల్‌ సంస్థ (ఎఫ్‌ఆర్‌ఎల్‌) వ్యాపారాలను రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌కి (ఆర్‌ఆర్‌వీఎల్‌) విక్రయించేందుకు గతేడాది ఆగస్టులో డీల్‌ కుదుర్చుకుంది.

దీని విలువ సుమారు రూ. 24,713 కోట్లు. అయితే, అప్పటికే ఫ్యూచర్‌ గ్రూప్‌లో భాగమైన ఫ్యూచర్‌ కూపన్స్‌లో అమెజాన్‌ వాటాలు కొనుగోలు చేసింది. ఫ్యూచర్‌ కూపన్స్‌ సంస్థ ఎఫ్‌ఆర్‌ఎల్‌లో వాటాదారు కావడంతో పరోక్షంగా అమెజాన్‌కు కూడా స్వల్ప వాటాలు లభించాయి. ఈలోగా రిలయన్స్‌తో ఫ్యూచర్‌ గ్రూప్‌ ఒప్పందం కుదుర్చుకోవడం నిబంధనలకు విరుద్ధమంటూ న్యాయస్థానాలను ఆశ్రయించింది. ఈ క్రమంలో రిలయన్స్‌కు ఫ్యూచర్‌ గ్రూప్‌ అసెట్స్‌ విక్రయించకుండా స్టే విధిస్తూ మార్చి 18న ఢిల్లీ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. అయితే, మార్చి 22న డివిజనల్‌ బెంచ్‌ వీటిని పక్కన పెట్టింది. ప్రస్తుతం దీనిపైనే అమెజాన్‌ మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement