Capital Gain Tax: పన్నులు చెల్లించండి..అభివృద్ధికి సహకరించండి..

All About Capital Gains Tax In India - Sakshi

స్థిరాస్తులు విక్రయించినప్పుడు దఖలుపడే క్యాపిటల్‌ గెయిన్స్‌కి సంబంధించి గత వారం చెప్పుకొన్న దానికి కొనసాగింపుగా మరిన్ని ఉదాహరణలు చూద్దాం. ఒక్కొక్కపుడు రోడ్డు వైడనింగ్‌ లేదా అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం.. స్థిరాస్తులను కంపల్సరీగా స్వాధీనపర్చుకుంటుంది. అలా స్వాధీ నపర్చుకున్నందుకు గాను నష్టపరిహారం ఇస్తుంటుంది. అది పూర్తిగా చేతికి ముట్టిన తేదీని బదిలీ తేదిగా పరిగణిస్తారు. మీరు కొనబోయే కొత్త ఆస్తి గడువు తేదీని లెక్కించడానికి, నష్టపరిహారం పూర్తిగా ముట్టిన తేదీని పరిగణనలోకి తీసుకోవాలి. స్వయంగా అమ్ముకున్నా, కంపల్సరీగా వదులుకున్నా.. మిగతా ఏ విషయాల్లోనూ ఎటువంటి మార్పు ఉండదు. 

ఉదాహరణకు .. ఒక ఉద్యోగి 2014 ఏప్రిల్‌లో ఇల్లు కొని 25–04–2021న రూ. 25,20,000కు విక్రయించారనుకుందాం. క్యాపిటల్‌ గెయిన్‌ రూ. 5,00,000 అనుకుందాం. 31–3– 2021తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి గాను రిటర్ను వేయడానికి ఆఖరు తేదీ 31–07–2022. అతను ఇల్లు కొనలేదు.. కట్టుకోలేదు. గడువు తేదీ లోపల రూ. 5,00,000 మొత్తాన్ని క్యాపిటల్‌ గెయిన్‌ అకౌంటులో జమ చేశారు (ఇలా చేయడం వల్ల మినహాయింపు పొందవచ్చు). ఆ తర్వాత 2023 జనవరిలో ఈ ఖాతాలో నుంచి రూ. 4,00,000 విత్‌డ్రా చేసి ఇల్లు కొన్నారు. 25–04–2021 నుంచి రెండు సంవత్సరాల లోపల ఇల్లు కొనాలి లేదా మూడు సంవత్సరాల లోపల ఇల్లు కట్టాలి. సదరు ఉద్యోగి 2023 జనవరిలో ఇల్లు కొన్నారు ..కాబట్టి మినహాయింపు లభిస్తుంది. కానీ, రూ. 4,00,000 మాత్రమే వెచ్చించి కొన్నారు కాబట్టి.. అంతవరకే మినహాయింపు ఇస్తారు. ఖర్చు పెట్టని రూ. 1,00,000కి గతంలో ఇచ్చిన మినహాయింపును రద్దు చేసి ఆ మొత్తాన్ని 2024–25 సంవత్సరం దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణించి పన్ను భారాన్ని లెక్కిస్తారు.  

ఇక మరో ఉదాహరణలో క్యాపిటల్‌ గెయిన్‌ రూ. 5,00,000 అయితే.. స్కీమ్‌లో డిపాజిట్‌ చేసింది రూ. 8,00,000 అనుకుందాం. అంటే మూడు లక్షల రూపాయలు అదనంగా డిపాజిట్‌ చేశారనుకుందాం. ఇలా చేయడం వల్ల ఉపయోగం లేదు. కానీ గడువు తేదీలోగా ఇల్లు కొనలేదు, కట్టనూ లేదు అనుకుంటే .. అలాంటప్పుడు స్కీమ్‌లో డిపాజిట్‌ చేసినప్పుడు రూ. 5,00,000కు ఇచ్చిన మినహాయింపును రద్దు చేస్తారు. అదనంగా డిపాజిట్‌ చేసినంత మాత్రాన అదనంగా మినహాయింపునివ్వరు.  

ఒకాయన క్యాపిటల్‌ గెయిన్స్‌ మొత్తాన్ని స్కీములో పెట్టి .. మినహాయింపు పొంది.. తర్వాత స్కీములో నుంచి మొత్తం విత్‌డ్రా చేసి ఎంచక్కా కారు కొనుక్కున్నారు. దీంతో మినహాయింపుని రద్దు చేసి ఆ మొత్తాన్ని ఆదాయంగా లెక్కేశారు. ఇలాగే స్కీములో నుంచి విత్‌డ్రా చేసి ఇల్లు కొనుక్కోకుండా, కట్టుకోకుండా.. ఆడపిల్ల పెళ్లి చేసిన కల్యాణ రావుకి, పిల్లాడి చదువు చెప్పించిన విద్యాధర రావుకి మినహాయింపు రద్దయి .. పన్ను భారం తప్పలేదు. ఇన్‌కం ట్యాక్స్‌ ప్లానింగ్‌ అంటే .. పన్ను ఎగవేత కాదు. సాధ్యమైనంత వరకూ పన్ను భారం లేకుండా చూసుకునేందుకు రాచమార్గాన్ని ఎంచుకోండి. ఎన్నో మార్గాలు ఉన్నాయి. మీకు అనువైన మార్గాన్ని ఎంచుకోండి. మీ కుటుంబ పరిస్థితులు, అవసరాలు, బాధ్యతలు, ప్రాధాన్యతాంశాలు మొదలైన వాటిని దృష్టిలో పెట్టుకుని అడుగేయండి. చట్టప్రకారం వెళ్లండి. శాంతి .. ప్రశాంతత ముఖ్యం. సక్రమంగా వెళ్లాలి. సజావుగా జరగాలి. మోసపోకూడదు. బ్లాక్‌ జోలికి పోవద్దు. ఇతర చట్టాలు .. అంటే.. రిజిస్ట్రేషన్‌ చట్టం, స్టాంపు డ్యూటీ, టీడీఎస్, ఎన్నారైలతో డీల్‌ చేసేటప్పుడు ఫెమా చట్టం , బ్యాంకులు, రుణాలు ఇలా ఎన్నో వలయాలను క్రమంగా ఛేదించుకుంటూ వ్యవహారాన్ని నిర్వహించండి. గజం పది రూపాయలకు కొని .. లక్షల రూపాయలకు అమ్మినప్పుడు నేను ఇంత భారీ మొత్తం పన్ను కట్టాలా అని ఆలోచించకండి. మా తాత కష్టపడి సంపాదిం చిన ఆస్తి అని తప్పటడుగులు వేయకండి. అంత మొత్తం రావడం అదృష్టంగా భావించి ఆ అదృష్టంలో 20 శాతం ప్రభుత్వం ద్వారా ప్రజల అభివృద్ధికి జమ చేయండి. పన్నులు ఎగ్గొట్టే జల్సా జనాలతో పోల్చుకోకుండి. మీరు నిజాయితీ మనుషులుగా వ్యవహరించండి.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top