ఎయిర్‌టెల్‌ లాభాల ట్యూన్‌

Airtel Q 4 Results - Sakshi

క్యూ4 లాభం రూ. 2,008 కోట్లు

  షేరుకి రూ. 3 చొప్పున డివిడెండ్‌   

న్యూఢిల్లీ: దేశీ మొబైల్‌ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ పనితీరు ప్రదర్శించింది. క్యూ4(జనవరి–మార్చి)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం రెండున్నర రెట్లు ఎగసి రూ. 2,008 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 759 కోట్లు మాత్రమే ఆర్జించింది. తాజా క్వార్టర్‌లో అనుకోని లాభాన్ని పక్కనపెడితే రూ. 1,860 కోట్ల నికర లాభం సాధించినట్లు ఎయిర్‌టెల్‌ వెల్లడించింది. క్యూ4లో మొత్తం ఆదాయం 22 శాతం వృద్ధితో రూ. 31,500 కోట్లకు చేరింది. దేశీ ఆదాయం 23 శాతం జంప్‌చేసి రూ. 22,500 కోట్లను తాకింది. ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) రూ. 145 నుంచి రూ. 178కు ఎగసింది. టారిఫ్‌లు పెంచడం, 4జీ కస్టమర్లు జత కలవడం ఇందుకు సహకరించింది. వాటాదారులకు ఎయిర్‌టెల్‌ బోర్డు షేరుకి రూ. 3 చొప్పున డివిడెండు ప్రకటించింది. 

పూర్తి ఏడాదికి
మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఎయిర్‌టెల్‌  రూ. 4,255 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2020–21లో రూ. 15,084 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం టర్నోవర్‌ 16 శాతం పుంజుకుని రూ. 1,16,547 కోట్లకు చేరింది. 4జీ కస్టమర్ల మొత్తం సంఖ్య 20 కోట్లను దాటగా.. గతేడాది 21.5 మిలియన్లమంది కొత్తగా జత కలిశారు. సగటు డేటా వినియోగం నెలకు 18.8 జీబీకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. మార్చికల్లా లీజు చెల్లింపులను మినహాయిస్తే నికరంగా కన్సాలిడేటెడ్‌ రుణ భారం రూ. 1,23,544 కోట్లుగా నమోదైంది. 
మార్కెట్లు ముగిశాక ఫలితాలు విడుదల చేసింది. 

చదవండి: నేను చెప్తున్నాగా! ఎయిర్‌టెల్‌ భవిష్యత్తు బ్రహ్మాండం!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top