విమానాశ్రయాలకు మంచి రోజులు!

Airports set to come out of the red next fiscal 2022-23 - Sakshi

వచ్చే ఆర్థిక సంవత్సరం కోలుకునే అవకాశం

ఆదాయాలు 50 శాతం పెరిగే చాన్స్‌

అంతర్జాతీయ విమానాల పునఃప్రారంభం నేపథ్యం

దేశీయంగా చార్జీల పెరుగుదలా కారణమే..

ఇక్రా నివేదిక విశ్లేషణ

ముంబై: మహమ్మారి వల్ల గత రెండు సంవత్సరాల్లో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన విమానాశ్రయాలకు వచ్చే ఆర్థిక సంవత్సరం (2022–23) మంచి రోజులు రానున్నాయని రేటింగ్‌ దిగ్గజం ఇక్రా ఒక నివేదికలో పేర్కొంది.  సాధారణ అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణ, దేశీయంగా విమానయాన చార్జీల పెంపు దీనికి ప్రధాన కారణమని పేర్కొంది. మహమ్మారి కారణంగా రెండేళ్ల నిషేధం తర్వాత ఆదివారం నుండి అంతర్జాతీయ వాణిజ్య కార్యకలాపాలను పునఃప్రారంభమయిన నేపథ్యంలో విడుదలైన నివేదికలోని ముఖ్యాంశాలు పరిశీలిస్తే...

► విమాన ప్రయాణీకుల రద్దీ సంవత్సరం వారీగా 68 నుంచి 70 శాతం మేర వృద్ధి చెంది 2022– 2023 ఆర్థిక సంవత్సరంలో 31.7 కోట్ల నుంచి 32 కోట్ల శ్రేణికి చేరే వీలుంది.  
► ఈ అంశాల కారణంగా 2022–23 ఆర్థిక సంవత్సరంలో విమానాశ్రయాల నిర్వహణ ఆదా యం 49–51 శాతం శ్రేణిలో పెరిగి రూ. 14,400–14,600 కోట్లకు చేరుకుంటుంది. ఆపరేటర్లకు 29–30 శాతం ఆపరేటింగ్‌ మార్జిన్‌ లభించే అవకాశం ఉంది. 2021–22లో ఈ రేటు 18 నుంచి 19 శాతం ఉంది. అయితే కరోనా ముందస్తు ఏడాది అంటే 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ ఆదాయాల వృద్ధి రేటు (అప్పట్లో 40 శాతం) ఇంకా వెనకబడి ఉండడం గమనార్హం. అయితే ఈ స్థాయి వృద్ధి రేటు తిరిగి 2023–24 ఆర్థిక సంవత్సరంలో నమోదయ్యే వీలుంది.  
► అంతర్జాతీయ ట్రాఫిక్‌ 100–105 శాతం పటిష్ట వృద్ధిని సాధిస్తుంది. అయితే ఈ స్థాయిలో మంచి గణాంకాల సాధనకు నాల్గవవేవ్‌ సవాళ్లు తలెత్తకూడదు. ఒకవేళ ఈ సవాళ్లు వచ్చినా దాని ప్రభావం అతి తక్కువగా ఉండాల్సి ఉంటుంది.  
► ఇక మార్చి 31తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వస్తే, పాసింజర్‌ ట్రాఫిక్‌ 62 నుంచి 64 శాతం పెరిగి 18.7 కోట్ల నుంచి 18.9 కోట్ల శ్రేణిలో నమోదుకావచ్చు. ఒమిక్రాన్‌ సవాళ్లు ఎదురయినప్పటికీ, ఈ స్థాయి వృద్ధి రేటు నమోదుకు పటిష్ట వ్యాక్సినేషన్‌ కారణం.  
►  అంతర్జాతీయ విమానాల పునఃప్రారంభం కారణంగా  ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం, ఐరోపా దేశాల నుంచి ట్రాఫిక్‌ గణనీయంగా మెరుగుపడుతుంది.

పెట్టుబడులు ఇలా..
ఇదిలాఉండగా ఇక్రా నివేదిక ప్రకారం, విమానయాన రంగం వచ్చే ఐదేళ్లలో రూ.90,000 కోట్ల కొత్త పెట్టుబడులను పొందే వీలుంది. ఇందులో ప్రధాన ప్రైవేట్‌ విమానాశ్రయాల్లో కొనసాగుతున్న సామర్థ్య విస్తరణ, ఎయిర్‌పోర్ట్‌ అధారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) నిర్వహించే విమానాశ్రయాల్లో ఆ సంస్థ రూ. 25,000 కోట్ల పెట్టుబడులు,  21 కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాల ఏర్పాటుకు రూ. 30,000 –34000 కోట్లు, ఏఏఐ నుంచి స్వాధీనం చేసుకున్న ఆరు విమానాశ్రయాలను అప్‌గ్రేడ్‌ చేయడానికి అదానీ గ్రూప్‌ పెడుతున్న దాదాపు రూ. 17,000 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top