పెరిగిన ఇంధన సర్‌చార్జీలు
ఎయిర్ ఇండియా, ఏఐ ఎక్స్‌ప్రెస్, ఆకాశ ఎయిర్ నిర్ణయం
నేటి నుంచే అమల్లోకి
న్యూఢిల్లీ: జెట్ ఇంధన ధరలు భారీగా పెరగడంతో విమానయాన సంస్థలు ప్రయాణికులపై అదనపు భారం మోపుతున్నాయి. ఎయిరిండియా, ఏఐ ఎక్స్‌ప్రెస్, ఆకాశ ఎయిర్ ఇంధన సర్‌చార్జీలు పెంచాయి. ఈ పెంపుదల నేటి(9) నుంచి అమల్లోకి రానుంది. పెరుగుతున్న నిర్వహణ వ్యయాలను కొంత మేర భర్తీ చేసుకునేందుకు విమానయాన సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో విమాన టికెట్ ధరలు మరింత పెరిగే అవకాశముంది.
ప్రస్తుతం ఎయిరిండియా, ఏఐ ఎక్స్‌ప్రెస్.. దేశీ సర్వీసులపై దూరం ఆధారంగా ఇంధన సర్‌చార్జీలను రూ. 400 నుంచి 1,200 వరకూ సవరించాయి. అంతర్జాతీయ విమానాలపై 55–215 డాలర్ల మధ్య సర్‌చార్జీలను విధిస్తున్నాయి. అయితే ఆకాశ ఎయిర్ దేశీ విమాన సర్వీసులపై తిరిగి చార్జీల విధింపును చేపడుతున్నట్లు పేర్కొంది. దూరాన్నిబట్టి రూ. 375–1,150 మధ్య చార్జీలను విధిస్తున్నట్లు వెల్లడించింది.
అంతర్జాతీయ రూట్లలో సవరించిన సర్‌చార్జీ రూ. 2,500గా ప్రకటించింది. తద్వారా పెరుగుతున్న నిర్వహణా వ్యయాలకు కొంతమేర చెక్ పెట్టాలని విమానయాన కంపెనీలు భావిస్తున్నాయి. విమాన ఇంధన(జెట్ ఫ్యూయల్) ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దేశ, విదేశీ విమాన సర్వీసులపై ఫ్యూయల్ సర్‌చార్జీలను పెంచుతున్నట్లు ఇప్పటికే ఇండిగో పేర్కొంది. సవరించిన చార్జీలను ఈ నెల 6 నుంచి అమలు చేస్తోంది.


