హైదరాబాద్‌ లోకల్‌ కంపెనీల నుంచి ఎంఎన్‌సీల దాకా! గూగుల్‌ బాటలోనే..

After Google Many Companies Follow No Pay For Unvaccinated Employees Policy - Sakshi

ఒమిక్రాన్‌ వేరియెంట్‌ విజృంభణతో వర్క్‌ఫ్రమ్‌ హోం కొనసాగింపు డిమాండ్‌కు తలొగ్గుతున్న టెక్‌ దిగ్గజాలు.. ఉద్యోగుల వ్యాక్సినేషన్‌ విషయంలో మాత్రం అస్సలు తగ్గట్లేదు!.  ఈ విషయంలో జీతాల కోతల నుంచి అవసరమైతే ఉద్యోగాల నుంచి తొలగించేందుకు సైతం వెనకాడట్లేదు. తాజాగా వ్యాక్సిన్‌ వేసుకోని ఉద్యోగుల్ని.. ఇంటికి సాగనంపాలని గూగుల్‌ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే బాటలో పయనించేందుకు కంపెనీలన్నీ సిద్ధపడుతున్నాయి. 
 

ఐటీ ఉద్యోగులు, ఇతర కంపెనీల్లో పని చేసే ఉద్యోగులకు అలర్ట్‌. వెంటనే వ్యాక్సిన్‌ వేయించుకోండి. ఆ సర్టిఫికెట్‌ను కంపెనీల్లో సమర్పించండి. లేకుంటే జీతాల కట్టింగ్‌.. అవసరమనుకుంటే ఊస్టింగ్‌కు కంపెనీలు సిద్ధపడుతున్నాయి. టెక్‌ దిగ్గజం గూగుల్‌ నిర్ణయం ప్రకటించాక.. తర్వాత మరో ప్రముఖ కంపెనీ ఇలాంటి నిర్ణయమే ప్రకటించింది. సెమీకండక్టర్‌లు తయారు చేసే ఇంటెల్‌ కంపెనీ తాజాగా ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. జనవరి 4లోపు వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌-వివరాల్ని సమర్పించాలని.. లేనిపక్షంలో వేతనం లేని సెలవుల మీద ఉద్యోగుల్ని పంపిస్తామని హెచ్చరించింది. ఇక వ్యాక్సినేషన్‌ను దూరంగా ఉంటున్న ఉద్యోగాలు మినహాయింపుల కోసం సరైన ధృవపత్రాల్ని సమర్పించాలని కోరింది. 

మెడికల్‌, మతపరమైన కారణాలను మాత్రమే మినహాయింపులుగా పరిగణిస్తామని,  ఇతర కారణాలను అంగీకరించబోదని మెమోలో పేర్కొంది ఇంటెల్‌. ఇందుకోసం మార్చి 15, 2022 డెడ్‌లైన్‌ విధించారు.  ఇక వ్యాక్సినేషన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తే.. మూడు నెలలపాటు జీతాలు ఇవ్వమని, అప్పటికీ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ సమర్పించకపోతే తొలగింపు దిశగా ఆలోచిస్తామని ఇంటెల్‌ హెచ్‌ఆర్‌ హెడ్‌ క్రిస్టీ పాంబియాంచీ వెల్లడించారు. ఇక గూగుల్‌, ఇంటెల్‌ లాగే మరో 100 కంపెనీలు (మైక్రోసాఫ్ట్‌, మెటాలతో పాటు భారత్‌కు చెందిన కొన్ని ప్రముఖ కంపెనీలు కూడా ఉన్నాయి) ఈ నిర్ణయాన్ని త్వరలో ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.    


హైదరాబాద్‌లోనూ!

వ్యాక్సినేషన్‌కి దూరంగా ఉంటున్న ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని దేశంలోని కంపెనీలు సైతం నిర్ణయించాయి.  ఇదిలా ఉంటే హైదరాబాద్‌ నగరంలోనూ కొన్ని ఐటీ కంపెనీలు, చిన్నాచితకా కంపెనీలు సైతం ఉద్యోగుల్ని వ్యాక్సినేషన్‌ రిపోర్టులు సమర్పించాలని పట్టుబడుతున్నాయి. కొన్ని కంపెనీలైతే వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉంటున్న ఎంప్లాయిస్‌కు ‘హై రిస్క్‌’ ట్యాగ్‌ను తగిలిస్తుండడంతో.. సదరు ఉద్యోగులు అవమానభారంగా భావిస్తున్నారు. తద్వారా వ్యాక్సినేషన్‌లో పాల్గొంటున్నారు. 

నో రిక్రూట్‌మెంట్‌ 

ఇక ఉద్యోగాల విషయంలోనే కాదు.. వాటి భర్తీ విషయంలోనూ కఠినంగా వ్యాక్సినేషన్‌ రూల్స్‌ ఫాలో అవుతున్నారు. వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉంటే.. వాళ్లకు ఉద్యోగాలు కష్టంగా మారే అవకాశాలే కనిపిస్తున్నాయి ఇప్పుడు.  ఐటీ, కార్పొరేట్‌, రియల్టి, ఫ్యాకల్టీ రంగాల్లో రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌లో వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ సమర్పణ కాలం తప్పనిసరిగా ఉంటోంది.   చాలా కంపెనీల్లో హెచ్‌ఆర్‌లు.. ఇంటర్వ్యూ ప్రాసెస్‌ మొదలుపెట్టే ముందే వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్లు అడుగుతుండడం విశేషం.

చదవండి: ఒమిక్రాన్‌ అలజడి! భారత్‌ను కుదిపేయనుందా?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top