గోద్రెజ్‌లో కీలక పరిణామం, చైర్మన్‌ పదవికి ఆది గోద్రెజ్‌ రాజీనామా

Adi Godrej To Resign As Godrej Industries Chairman, nadir Godrej To Take Over - Sakshi

న్యూఢిల్లీ: పాతతరం పారిశ్రామికవేత్త ఆది గోద్రెజ్‌ తాజాగా గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌(జీఐఎల్‌) చైర్మన్‌ పదవి నుంచి వైదొలగారు. అంతేకాకుండా కంపెనీ బోర్డు నుంచి సైతం తప్పుకున్నారు. తమ్ముడు నాదిర్‌ గోద్రెజ్‌కు కంపెనీ పగ్గాలు అప్పజెప్పారు. అక్టోబర్‌ 1నుంచి చైర్మన్‌గా నాదిర్‌ బాధ్యతలు చేపట్టనున్నట్లు గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ పేర్కొంది. 79ఏళ్ల ఆది గోద్రెజ్‌ ఇకపై గోద్రెజ్‌ గ్రూప్‌నకు చైర్మన్‌గా, జీఐఎల్‌కు గౌరవ చైర్మన్‌గానూ వ్యవహరించనున్నట్లు తెలియజేసింది. నాదిర్‌ గోద్రెజ్‌ ప్రస్తుతం జీఐఎల్‌కు ఎండీగా పనిచేస్తున్నారు. తాజా మార్పులతో చైర్మన్, ఎండీ పదవులను నిర్వహించనున్నారు.
 
కృతజ్ఞతలు.. 
జీఐఎల్‌కు ఆది గోద్రెజ్‌ దశాబ్దాల తరబడి సర్వీసులు అందించారు. నాలుగు దశాబ్దాలకుపైగా కంపెనీలో బాధ్యతలు నిర్వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు ఆది గోద్రెజ్‌ పేర్కొన్నారు. ఈ కాలంలో పటిష్ట ఫలితాలు సాధించడంతోపాటు కంపెనీలో సమూల మార్పులను తీసుకువచ్చినట్లు తెలియజేశారు. తన ప్రయాణంలో మద్దతుగా నిలిచిన బోర్డుతోపాటు, టీమ్‌ సభ్యులు, బిజినెస్‌ భాగస్వాములు, వాటాదారులు, ఇన్వెస్టర్లు తదితరులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. నాదిర్‌ సారథ్యంలో ఇకపై కంపెనీ మరింత పురోగాభివృద్ధిని సాధించగలదన్న ధీమాను వ్యక్తం చేశారు. కాగా.. ఆది గోద్రెజ్‌ నాయకత్వం, విజన్, కంపెనీని మలచిన తీరు, విలువలు వంటి అంశాలపట్ల జీఐఎల్‌తోపాటు, బోర్డు తరఫున నాదిర్‌ గోద్రెజ్‌ కృతజ్ఞతలు తెలియజేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top