అదానీ చేతికి హోల్సిమ్‌ ఇండియా

Adani group wins race to buy Ambuja Cements, ACC for - Sakshi

సిమెంట్‌ రంగంలో భారీ కొనుగోలు

అంబుజా సిమెంట్స్, ఏసీసీలో మెజారిటీ వాటా

ఒప్పందం విలువ రూ. 80,000 కోట్లు

అంబుజా సిమెంట్స్‌కు రూ. 385, ఏసీసీకి రూ. 2,300 ధర

న్యూఢిల్లీ: ఆసియా కుబేరుడు, దేశీ దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ గ్రూప్‌ తాజాగా సిమెంట్‌ రంగంలో భారీ డీల్‌కు తెరతీసింది. స్విస్‌ దిగ్గజం హోల్సిమ్‌ లిమిటెడ్‌కు దేశీ అనుబంధ సంస్థలైన అంబుజా సిమెంట్స్, ఏసీసీ లిమిటెడ్‌లను కొనుగోలు చేయనుంది. ఇందుకు ప్రత్యేక ఒప్పందం కుదిరినట్లు రెండు గ్రూప్‌లు ప్రకటించాయి. వెరసి సిమెంట్‌ దిగ్గజాలు అంబుజా, ఏసీసీలలో మెజారిటీ వాటాను అదానీ గ్రూప్‌ సొంతం చేసుకోనుంది.

ఇందుకు పబ్లిక్‌ వాటాదారులకు ఓపెన్‌ ఆఫర్లతో కలిపి రూ. 80,000 కోట్లు(10.5 బిలియన్‌ డాలర్లు) వరకూ వెచ్చించవలసి ఉంటుందని అదానీ గ్రూప్‌ వెల్లడించింది. కీలకమైన పోర్టులు, పవర్‌ ప్లాంట్లు, కోల్‌ మైన్స్‌ నిర్వహించే అదానీ గ్రూప్‌ గత కొన్నేళ్లుగా విమానాశ్రయాలు, డేటా సెంటర్లు, క్లీన్‌ ఎనర్జీవైపు దృష్టిసారించింది.

ఈ బాటలో సిమెంట్‌ రంగంలోనూ గతేడాది ప్రవేశించింది. అదానీ సిమెంటేషన్‌ పేరుతో రెండు అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసింది. తాజా డీల్‌ ద్వారా అదానీ గ్రూప్‌ దేశీయంగా సిమెంట్‌ రంగంలో రెండో పెద్ద కంపెనీగా ఆవిర్భవించనుంది.  కాగా.. సిమెంట్‌ తయారీకి ప్రపంచ దిగ్గజంగా నిలుస్తున్న హోల్సిమ్‌ దేశీ సిమెంట్‌ బిజినెస్‌నుంచి వైదొలగనున్నట్లు గత నెలలో ప్రకటించింది. తదుపరి ఆదిత్య బిర్లా, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌లతోపాటు.. అల్ట్రాటెక్‌ తదితర దిగ్గజాలతో చర్చలు నిర్వహిస్తూ వచ్చింది.  

డీల్‌ వివరాలివీ..
► 17 ఏళ్ల క్రితం దేశీ కార్యకలాపాలు ప్రారంభించిన హోల్సిమ్‌ ఇండియా అంబుజా సిమెంట్స్‌లో 63.19% వాటా ఉంది. అంబుజాకు మరో లిస్టెడ్‌ దిగ్గజం ఏసీసీలో మెజారిటీ(50.05%) వాటా ఉంది. ఏసీసీలో హోల్సిమ్‌ మరో 4.48% వాటాను కలిగి ఉంది. ఈ వాటాలను అదానీ గ్రూప్‌ కొనుగోలు చేయనుంది.
► అంబుజా సిమెంట్‌కు ఒక్కో షేరుకి రూ. 385, ఏసీసీ లిమిటెడ్‌కు రూ. 2,300 చొప్పున అదానీ గ్రూప్‌ చెల్లించనుంది.
► సెబీ నిబంధనల ప్రకారం రెండు సంస్థల సాధారణ వాటాదారులకు అదానీ గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించవలసి ఉంటుంది.  
► అంబుజా సిమెంట్స్, ఏసీసీ లిమిటెడ్‌ల ప్రస్తుత సంయుక్త సిమెంట్‌ తయారీ సామర్థ్యం వార్షికంగా 70 మిలియన్‌ టన్నులు. ప్రత్యర్ధి సంస్థ అల్ట్రాటెక్‌ సిమెంట్‌ వార్షికంగా 119.95 మిలియన్‌ టన్నుల గ్రే సిమెంట్‌ సామర్థ్యంతో టాప్‌ ర్యాంకులో నిలుస్తోంది.  

దిగ్గజాల తీరిదీ
► ఏసీసీ 17 తయారీ యూనిట్లు, 9 సొంత అవసరాల( క్యాప్టివ్‌) విద్యుత్‌ ప్లాంట్లను కలిగి ఉంది.  దేశవ్యాప్తంగా 56,000 మంది డీలర్లు, రిటైలర్లతో నెట్‌వర్క్‌ను విస్తరించింది.
► అంబుజా సిమెంట్స్‌ మొత్తం 31 మిలియన్‌ టన్నుల సామర్థ్యంగల 6 సమీకృత తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. 8 సిమెంట్‌ గ్రైండింగ్‌ యూనిట్లు సైతం ఏర్పాటు చేసింది.  
► 2015లో ఫ్రాన్స్‌ దిగ్గజం లఫార్జ్‌తో హోల్సిమ్‌ విలీనమైంది. లఫార్జ్‌హోల్సిమ్‌గా ఆవిర్భవిం చింది. ఏసీసీలో హోల్సిమ్‌ ఇండియాకుగల 24 శాతం వాటాను అంబుజా 2016 జూన్‌లో కొనుగోలు చేసింది. దీంతో ఏసీసీలో అంబుజా వాటా 50.05 శాతానికి చేరింది.

క్వింటిలియన్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌
తాజాగా 49 శాతం వాటా కొనుగోలు
డిజిటల్‌ బిజినెస్‌ న్యూస్‌ ప్లాట్‌ఫామ్‌ క్వింటిలియన్‌ బిజినెస్‌ మీడియా ప్రయివేట్‌ లిమిటెడ్‌(క్యూబీఎంఎల్‌)లో 49 శాతం వాటా ను సొంతం చేసుకోనున్నట్లు అదానీ గ్రూప్‌ పేర్కొంది. ఇందుకు గ్రూప్‌ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్‌ ద్వారా క్యూబీఎంఎల్, క్వింటిలియన్‌ మీడియా లిమిటెడ్‌(క్యూఎంఎల్‌)తో వాటాదారులు, వాటా కొనుగోలు ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు వెల్లడించింది.

వాటా కొనుగోలుకి క్వింట్‌ డిజిటల్‌ మీడియా(క్యూడీఎంఎల్‌)తో సైతం ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. రాఘవ్‌ బల్‌ కంపెనీ క్యూబీఎంఎల్‌లో మైనారిటీ వాటా కొనుగోలు ద్వారా మీడియా బిజినెస్‌లోకి ప్రవేశించనున్నట్లు ఈ ఏడాది మార్చిలోనే అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ పేర్కొంది. క్యూబీఎంఎల్‌.. బ్లూమ్‌బెర్గ్‌క్వింట్‌ పేరుతో బిజినెస్‌ న్యూస్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ను నిర్వహిస్తోంది.  డిజిటల్‌ బిజినెస్‌ న్యూస్‌ ప్లాట్‌ఫామ్‌ కోసమే అదానీ గ్రూప్‌తో డీల్‌ను కుదుర్చుకున్నట్లు క్యూడీఎంఎల్‌  తెలిపింది. కాగా, డీల్‌ విలువ తెలియలేదు.,       

మార్గదర్శనం
దేశీయంగా మా బిజినెస్‌లను అదానీ గ్రూప్‌ కొనుగోలు చేస్తున్నందుకు ఆనందిస్తున్నాం. తద్వారా దేశీయంగా తదుపరి దశ వృద్ధికి గ్రూప్‌ నాయకత్వం వహించగలదు.   
– జాన్‌ జెనిష్, సీఈవో, హోల్సిమ్‌ లిమిటెడ్‌

వృద్ధిపై విశ్వాసం
సిమెంట్‌ రంగంలో విస్తరించే ప్రణాళికలు దేశ వృద్ధి అవకాశాలపట్ల మాకున్న విశ్వాసానికి నిదర్శనం. ప్రపంచంలోనే భారత్‌ డిమాండు ఆధారిత ప్రధాన ఆర్థిక వ్యవస్థకాగా.. పలు దశాబ్దాలుగా సిమెంట్‌ తయారీలో రెండో ర్యాంకులో నిలుస్తోంది.  
– గౌతమ్‌ అదానీ, చైర్మన్, అదానీ గ్రూప్‌.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top