
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ తాజాగా ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్(గతంలో అదానీ విల్మర్)లో మరో 20 శాతం వాటా విక్రయించింది. భాగస్వామ్య కంపెనీ సింగపూర్ సంస్థ విల్మర్ ఇంటర్నేషనల్‌కు రూ. 7,150 కోట్లకు విక్రయించినట్లు అదానీ గ్రూప్ స్టాక్ ఎక్సే్ఛంజీలకు వెల్లడించింది. గ్రూప్‌నకు కీలక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్‌లపై మరింత దృష్టి పెట్టేందుకు వీలుగా అదానీ విల్మర్‌లో 44% వరకూ వాటాను విక్రయించనున్నట్లు గతేడాది డిసెంబర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పట్లో విల్మర్ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ లెన్స్ పీటీఈతో అనుబంధ సంస్థ అదానీ కమోడిటీస్ ఎల్‌ఎల్‌పీ ఇందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్ వెల్లడించింది.
ఒప్పందం ప్రకారం షేరుకి రూ. 305 మించకుండా తదుపరి దశలో నిర్ణయించుకునే ధరలో లావాదేవీకి తెరతీయనున్నట్లు వివరించింది. మరోవైపు 2025 జనవరిలో పబ్లిక్‌కు కనీస వాటా నిబంధన ప్రకారం షేరుకి రూ. 276.51 ధరలో అదానీ విల్మర్‌లో 13.51% వాటాను అదానీ ఎంటర్‌ప్రైజెస్ విక్రయించింది. తద్వారా రూ. 4,855 కోట్లు సమీకరించింది. దీంతో అదానీ విల్మర్‌లో వాటా 44% నుంచి 30.42%కి దిగివచ్చింది. ఈ బాటలో ప్రస్తుతం మరో 20% వాటాను షేరుకి రూ. 275 ధరలో విల్మర్ ఇంటర్నేషనల్‌కు విక్రయించింది. తద్వారా రూ. 7,150 కోట్లు అందుకోనుంది. తాజాగా ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్‌లో విల్మర్ ఇంటర్నేషనల్ వాటా 64%కి బలపడింది. మరోపక్క మిగిలిన 10.42 శాతం వాటాను సైతం త్వరలో విక్రయించనున్నట్లు అదానీ వెల్లడించింది.