అప్పులు తగ్గించుకుంటున్నాం...

Adani group says not overleveraged, loans from public sector banks halved - Sakshi

లాభ నిష్పత్తి మెరుగుపర్చుకుంటున్నాం

క్రెడిట్‌ఇన్‌సైట్స్‌ నివేదికకు అదానీ గ్రూప్‌ కౌంటర్‌

న్యూఢిల్లీ: వ్యాపారాల విస్తరణ కోసం ఎడాపెడా రుణాలు తీసుకుంటూ (ఓవర్‌లీవరేజ్‌), అప్పుల కుప్పగా మారిందంటూ వస్తున్న విమర్శలను అదానీ గ్రూప్‌ తోసిపుచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల భారాన్ని సగానికి పైగా తగ్గించుకున్నామని తెలిపింది. నికర రుణాలు, ఆపరేటింగ్‌ లాభాల నిష్పత్తిని మెరుగుపర్చుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ఓవర్‌లీవరేజ్‌ అంశంపై ఇటీవలి క్రెడిట్‌సైట్స్‌ నివేదికపై స్పందిస్తూ అదానీ గ్రూప్‌ 15 పేజీల నోట్‌ను విడుదల చేసింది. రుణాలు, నిర్వహణ లాభాల నిష్పత్తి గడిచిన తొమ్మిదేళ్లలో 7.6 రెట్ల నుంచి 3.2 రెట్లకు దిగి వచ్చినట్లు పేర్కొంది.

2015–16లో గ్రూప్‌ సంస్థల మొత్తం రుణాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు 55 శాతంగా ఉండగా .. 2021–22లో దీన్ని 21 శాతానికి తగ్గించుకున్నట్లు తెలిపింది. ఇక అప్పట్లో 31 శాతంగా ఉన్న ప్రైవేట్‌ బ్యాంకుల రుణాలు ప్రస్తుతం 11 శాతానికి పరిమితమైనట్లు వివరించింది. బాండ్ల ద్వారా సమీకరించుకుంటున్న నిధుల పరిమాణం 14 శాతం నుంచి 50 శాతానికి పెరిగిందని అదానీ గ్రూప్‌ పేర్కొంది. 2022 మార్చి ఆఖరు నాటికి గ్రూప్‌ స్థూల రుణాల రూ. 1.88 లక్షల కోట్లుగాను, నగదు నిల్వలను తీసేస్తే నికర రుణాలు రూ. 1.61 లక్షల కోట్లుగాను ఉన్నాయి.

కమోడిటీ ట్రేడింగ్‌ కంపెనీగా మొదలైన అదానీ గ్రూప్‌ గత కొన్నేళ్లుగా పోర్టులు, విమానాశ్రయాలు, సిమెంటు, డేటా సెంటర్లు, సిటీ గ్యాస్‌ లాంటి వివిధ రంగాల్లోకి శరవేగంగా విస్తరించింది. ఇందుకు కా వాల్సిన ఆర్థిక వనరుల కోసం రుణాలనే ఎంచుకుంటోందని, తద్వారా అప్పుల కుప్పగా మారిందని క్రెడిట్‌ఇన్‌సైట్స్‌ ఇటీవల ఒక నివేదికలో పేర్కొంది. ‘గడిచిన కొన్నేళ్లుగా అదానీ గ్రూప్‌ దూకుడుగా విస్తరణ ప్రణాళికలు అమలు చేస్తోంది.

అత్యధికంగా పెట్టుబడులు అవసరమయ్యే కొత్త లేదా సంబంధం లేని వ్యాపారాల్లోకి అడుగుపెడుతోంది. దీనితో రు ణాల గణాంకాలు, నిధుల ప్రవాహంపై తీవ్ర ఒత్తిడి పడుతోంది‘ అని  క్రెడిట్‌సైట్స్‌ తెలిపింది.   పరిస్థితి తల్లకిందులైతే .. రుణాల ఆధారిత వృద్ధి ప్రణాళికలు బెడిసికొట్టి, తీవ్ర రుణ సంక్షోభంలో చిక్కుకుపోయే ముప్పు ఉందని హెచ్చరించింది. ఫలితంగా గ్రూప్‌ కంపెనీల్లో ఒకటి పైగా సంస్థలు దివాలా తీసే అవకాశాలు ఉన్నాయని క్రెడిట్‌సైట్స్‌ పేర్కొంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top