4 Day Work Week: ఇకపై అందరికీ వారానికి నాలుగు రోజులపాటే పని...! కొత్త లేబర్‌కోడ్స్‌ అమలులోకి వస్తే..!

4 Day Work Week: India New Labour Laws May Be Implemented Next Financial Year - Sakshi

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్స్‌ విషయంలో కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ నాలుగు లేబర్‌ కోడ్స్‌ అమల్లోకి రానున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచే లేబర్‌ కోడ్స్‌ అమల్లోకి రావాల్సి ఉండగా.. కొత్త విధివిధానాలను రూపొందించడంలో జాప్యం జరగడంతో లేబర్‌ కోడ్స్‌ అమలు నిలిచిపోయింది.

వివిధ కార్మిక చట్టాలను సవరించిన వేతనాలు, సామాజిక భద్రత, పారిశ్రామిక సంబంధాలు, వృత్తి భద్రత; ఆరోగ్యం, పని పరిస్థితులు పేరిట నాలుగు లేబర్‌ కోడ్‌లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ లేబర్‌ కోడ్స్‌కు సంబంధించిన నియమ నిబంధనలను కేంద్రం రూపొందించింది. 

ఉమ్మడి జాబితాలో...
కేంద్రం తీసుకొచ్చిన కొత్త లేబర్‌ కోడ్స్‌ ఉమ్మడి జాబితాలో ఉన్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు కూడా విధివిధానాలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఇప్పటికే 18 రాష్ట్రాలు లేబర్‌ కోడ్స్‌ డ్రాఫ్ట్‌ను ప్రచురించాయి. ఈ 18 రాష్ట్రాలు నియమ నిబంధనలను ఖరారు చేసినట్లు ఇటీవల కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ రాజ్యసభలో వెల్లడించారు. అన్ని రాష్ట్రాలూ నిబంధనలను ఖరారు చేశాక వచ్చే ఏడాది నుంచి ఈ లేబర్‌ కోడ్‌లు అమల్లోకి రానున్నాయని కార్మిక శాఖ సీనియర్‌ అధికారి వెల్లడించారు.

లేబర్‌ కోడ్స్‌ అమలులోకి వస్తే..!
ఈ కొత్త లేబర్‌ కోడ్స్‌ అమల్లోకి వస్తే ఉద్యోగుల ప్రాథమిక వేతనం, ప్రావిడెంట్ ఫండ్ లెక్కించే విధానంలో గణనీయమైన మార్పులు రానున్నాయి. ప్రస్తుతానికి పలు కంపెనీలు బేసిక్‌ను తక్కువగా చూపి అలవెన్సుల రూపంలో ఎక్కువ మొత్తం ఇచ్చేవి. కొత్త వేతనాల కోడ్ ప్రకారం.. ఉద్యోగి స్థూల వేతనం 50 శాతం, అలవెన్సులు 50 శాతం చొప్పున ఉండాలి. అంటే ఉద్యోగులు టెక్‌ హోమ్‌ శాలరీ తగ్గి, ఆయా కంపెనీలు పీఎఫ్‌ వాటాలు గణనీయంగా పెరగనున్నాయి. 

అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉద్యోగుల పనిదినాలు కూడా మారనున్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న వారానికి ఐదు రోజుల పాలసీకు బదులుగా, వచ్చే ఏడాది నుంచి నాలుగు రోజుల పాటు పనిచేసే అవకాశం ఉద్యోగులకు రానుంది. ఒకవేళ ఈ ప్రతిపాదన వస్తే..ఆ నాలుగు రోజుల్లో ఉద్యోగులు 12 గంటలపాటు పని చేయాల్సి ఉంటుందని కార్మిక శాఖ వెల్లడించింది.

చదవండి: క్రిప్టోకరెన్సీ చట్టం: ముగియనున్న సమావేశాలు! క్రిప్టో బిల్లుపై జాప్యానికి కారణాలు ఏంటంటే..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top