స్టార్టప్‌లలో 24 వేల మంది ఉద్యోగుల తొలగింపులు!

24000 Employees Laid Off In 84 Startups - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశవ్యాప్తంగా 2022 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 24,000 పైచిలుకు ఉద్యోగులకు 84 ప్రధాన స్టార్టప్స్‌ ఉద్వాసన పలికాయి. మరికొన్ని కంపెనీలు సిబ్బంది సంఖ్యను తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి.

వీటిలో యూనికార్న్‌ కంపెనీలైన బైజూస్, చార్జ్‌బీ, కార్స్‌24, లీడ్, ఓలా, ఓయో, మీషో, ఎంపీఎల్‌ తదితర సంస్థలు ఉన్నాయి. కంపెనీనిబట్టి కొన్ని ఏకంగా 85 శాతం వరకు సిబ్బంది సంఖ్యను కుదించడం గమనార్హం. పునర్‌వ్యవస్థీకరణ, వ్యయ నియంత్రణ, తీవ్ర ఆర్థిక పరిస్థితులు, వ్యాపార విధానం మార్పు వంటివి ఉద్యోగుల తీసివేతలకు ప్రధాన కారణాలు. పనితీరు బాగోలేకపోవడం వల్ల కొంత మందిని కొన్ని కంపెనీలు తొలగించాయి. రాజీనామా చేయాల్సిందిగా కొన్ని సంస్థలు పలువురిని కోరాయి.

19 ఎడ్‌టెక్‌ స్టార్టప్స్‌లో నాలుగు యూనికార్న్‌ కంపెనీలు 9 వేల మందికిపైగా సిబ్బందిని సాగనంపాయి. ఎడ్‌టెక్‌ తర్వాత కంజ్యూమర్‌ సర్వీసెస్, ఈ–కామర్స్‌ రంగ కంపెనీల్లో ఎక్కువగా తీసివేతలు నమోదయ్యాయి. ఈ మూడు రంగాల్లోని 46 స్టార్టప్స్‌ సుమారు 19,000 మంది ఉద్యోగులను తొలగించినట్టు తెలుస్తోంది. అయిదు ఎడ్‌టెక్‌ స్టార్టప్స్‌ 2022లో మూతపడ్డాయి. ఈ విభాగంలోని 36 స్టార్టప్స్‌ 2023లో 5,800 మందికి ఉద్వాసన పలికాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top