180 ఎకరాల విస్తీర్ణంలో జపాన్‌ కంపెనీ ప్లాంట్.. ఎక్కడంటే?

180 Acres Plant of Japanese Company - Sakshi

న్యూఢిల్లీ: ఐఫోన్లకు కావాల్సిన బ్యాటరీలను సరఫరా చేస్తున్న జపాన్‌ కంపెనీ టీడీకే భారత్‌లో లిథియం అయాన్‌ సెల్స్‌ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. హర్యానాలోని మనేసర్‌ వద్ద 180 ఎకరాల విస్తీర్ణంలో ఇది రానుంది. 

దశలవారీగా ఈ కేంద్రానికి కంపెనీ రూ. 6,000–7,000 కోట్ల పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ వెల్లడించారు. పూర్తి స్థాయి ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభం అయ్యేనాటికి సుమారు 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. మేడిన్‌ ఇండియా ఐఫోన్లలో వాడే బ్యాటరీల కోసం ఈ ప్లాంటులో సెల్స్‌ను తయారు చేస్తారని మంత్రి తెలిపారు.

అయితే తయారీ కేంద్రం స్థాపనకై పర్యావరణ అనుమతి కోసం టీడీకే వేచి చూస్తోందని సమాచారం. లిథియం అయాన్‌ బ్యాటరీల తయారీలో ఉన్న చైనాకు చెందిన యాంపీరెక్స్‌ టెక్నాలజీని (ఏటీఎల్‌) 2005లో టీడీకే కొనుగోలు చేసింది. అనుబంధ కంపెనీ అయిన నవిటాసిస్‌ ఇండియా ద్వారా భారత్‌లో ఏటీఎల్‌ కార్యకలాపాలు సాగిస్తోంది. రీచార్జేబుల్‌ బ్యాటరీ ప్యాకేజ్‌లను హర్యానాలోని బావల్‌ వద్ద ఉన్న ప్లాంటులో నవిటాసిస్‌ తయారు చేస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top