సొమ్ము చేసుకుందాం
కార్పొరేషన్ కావడంతో..
క్రమబద్ధీకరణకు
పదుల సంఖ్యలో దరఖాస్తులు
జీవో 76 మాటున మొదలైన నయా దందా
లీజు స్థలాలకు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సామాన్యులకు ఊరట కలిగించేందుకు, వారి భవిష్యత్‌కు భద్రత ఇచ్చేందుకు అమల్లోకి తెచ్చిన జీఓ 76కు వక్రభాష్యాలు చెబుతూ సింగరేణి లీజు స్థలాలను కొట్టేసే కుట్రలు మొదలయ్యాయి. సింగరేణి సంస్థ ఇక్కడికి రాకముందు ప్రస్తుతం ఉన్న పాత కొత్తగూడెం ఒక్కటే మనుగడలో ఉండేది. పాల్వంచ సంస్థానం కాగా దాని పరిధిలో పాతకొత్తగూడెం కేంద్రంగా అగ్రహారం ఉండేది. చిట్టి శేషయ్య అనే వ్యక్తి పేరు మీద సుమారు 1,600 ఎకరాల భూమి ఉండేది. బొగ్గు గనులు మొదలైన తర్వాత అప్పటి బ్రిటీష్, నిజాం సర్కారులు ఆయన నుంచి మొత్తం భూమిని బొగ్గు తవ్వకాల కోసం కొనుగోలు చేశాయి. స్వాతంత్య్రం వచ్చాక సింగరేణి యాజమాన్య హక్కులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దఖలు పడ్డాయి.
70వ దశకంలో స్థలాల లీజు
బొగ్గు గనులు పెరుగుతున్న కొద్దీ కార్మికుల అవసరం పెరిగింది. కొత్తగూడెంలో కనీసం ఉప్పు, పప్పు వంటి కనీస దినుసులు లభించని పరిస్థితి నెలకొంది. దీంతో బ్రిటీష్, నిజాం అధికారులే 50వ దశకంలో ఇల్లెందు నుంచి వ్యాపారులను కొత్తగూడెం రప్పించారు. నిత్యావసర వస్తువులు అమ్ముకునేందుకు వీలుగా స్థలాలు కేటాయించారు. ఈ స్థలాలే నేడు చిన్న బజార్, పెద్దబజార్‌లుగా పిలుస్తున్నారు. కార్మికుల సంఖ్య మరింతగా పెరగడంతో వారికి అవసరమైన సేవలు అందించేందుకు వీలుగా ఆస్పత్రులు, పెట్రోలు బంకులు, మిల్లులు పెట్టుకునేందుకు తర్వాత దశలో 99 ఏళ్లకు సింగరేణి భూములను లీజుకు 70వ దశకంలో ఇచ్చారు.
శరవేగంగా కొత్తగూడెం అభివృద్ధి
సింగరేణి బొగ్గు గనులకు తోడుగా కేటీపీఎస్ ఇతర పరిశ్రమలు రావడంతో ఊహించని వేగంతో పెద్దబజార్, చిన్న బజార్‌లను దాటుకుని కొత్తగూడెం అభివృద్ధి చెందింది. దీంతో ఎంజీరోడ్డు ప్రధాన వాణిజ్య మార్గంగా మారగా.. కూలీలైన్, గాజులరాజంబస్తీ, మథుర బస్తీ, బూడిదగడ్డ తదితర కార్మికుల బస్తీలు ఏర్పడ్డాయి. ఆరంభంలో కేటాయింపులు, ఆ తర్వాత లీజుకు స్థలాల కేటాయింపులు తప్పితే మిగిలిన అన్ని నిర్మాణాలు, విస్తరణలకు ప్రభుత్వ పరంగా ఎటువంటి ఆమోదం లేదు. దీంతో ఇవన్నీ అక్రమ నిర్మాణాలుగా నిలిచాయి.
జీఓ 76 ద్వారా దరఖాస్తుల స్వీకరణ
పారిశ్రామిక ప్రాంతాలైన కొత్తగూడెంతోపాటు ఇల్లెందు, మణుగూరులు మొత్తం ఆక్రమణలతోనే ఉండటంతో ఉమ్మడి ఏపీలో తొలిసారి 373 జీఓ తెచ్చారు. సింగరేణి స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న స్థానికులకు యాజమాన్య హక్కులు కల్పించారు. తొలిదశలో చాలా మందికి యాజమాన్య హక్కులు దక్కాయి. తెలంగాణ వచ్చిన తర్వాత జీఓ నంబర్ 76 ద్వారా క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం జీఓ 76ను అనుసరించి మూడో దశలో దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, ఆమోదం ప్రక్రియలు నడుస్తున్నాయి.
జీఓకు విరుద్ధంగా..
జీఓ 76 ప్రధాన ఉద్దేశం గడిచిన 50 ఏళ్లుగా సింగరేణి స్థలాల్లో లెక్కాపత్రం లేకుండా ఇళ్లు కట్టుకున్న స్థానికులకు యాజమాన్య హక్కు కల్పించడం. సింగరేణి నుంచి లీజు పొందిన స్థలాలకు యాజమాన్య హక్కు ఇచ్చేందుకు జీఓ నంబరు 76లో అవకాశం లేదు. కానీ, గతంలో జరిగిన రెండు పర్యాయాల్లో స్థానికంగా ఉంటున్న కొందరు వృత్తి నైపుణ్యం కలిగిన వారు తమకు గతంలో కేటాయించిన లీజు స్థలాలపై యాజమాన్య హక్కులను పొందారు. అయితే, వీరంతా స్థానికంగానే నివాసం ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధికి తమవంతు సహకారం అందించారు.
లీజు అగ్రిమెంట్ ఉన్న ఈ స్థలం అనుభవదారులు లేదా వారి వారసులతో ఇప్పటికే అక్రమార్కులు మంతనాలు చేపట్టారు. మీరుంటున్న లీజు స్థలాన్ని ఇంటి స్థలంగా పేర్కొంటూ జీఓ నంబర్ 76 ద్వారా దరఖాస్తు చేయండి. అక్కడి నుంచి కథంతా మేము నడిపిస్తామని హామీ ఇస్తున్నారు. అన్నట్టుగానే ఇప్పటికే పదుల సంఖ్యలో దరఖాస్తులు వచ్చి పడ్డాయి. వీటి ఆధారంగా లీజు స్థలానికి యాజమాన్య హక్కు వచ్చిన మరుక్షణమే ఆ స్థలాన్ని ఓపెన్ మార్కెట్‌లో అమ్మకానికి రెడీ చేస్తున్నారు. ముందుగా మాట్లాడుకుంటే గజం రూ.50 వేలని, పట్టా వస్తే రూ.75వేలుగా బేరం పెడుతున్నారు.
కొత్తగూడెం జిల్లా కేంద్రంగా మారిన తర్వాత కార్పొరేట్ సంస్థలకు ఇక్కడ ఆసక్తి పెరిగింది. షాపింగ్ మాల్స్ మొదలు భారీ ఆస్పత్రులు, హోటళ్ల నిర్మాణానికి పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, కొత్తగూడెం నగరం చుట్టూ వన్ ఆఫ్ సెవంటీ చట్టం అమల్లో ఉండటంతో స్థల లభ్యత ప్రధాన సమస్యగా మారింది. దీంతో నగరం నడిబొడ్డున గతంలో సింగరేణి నుంచి లీజుకు తీసుకుని ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న స్థలాలు, లేదా గతంలో లీజుకు తీసుకున్న వ్యక్తులు ప్రస్తుతం ఇతర ప్రాంతాల్లో స్థిరపడగా వారికి సంబంధించి ఖాళీగా ఉన్న స్థలాలపై అక్రమార్కుల కన్ను పడింది.
కొత్తగూడెంలో భారీగా సింగరేణి లీజు స్థలాలు


