భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి నిత్యకల్యాణం శుక్రవారం వైభవోపేతంగా జరిగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన పూజలు చేశారు. ఆ తర్వాత మిథిలా స్టేడియంలోని రామసేవా మండపంలో కల్యాణమూర్తులను కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం నిర్వహించారు. అనంతరం స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా పూర్తిచేశారు.
పెద్దమ్మతల్లికి
అభిషేక పూజలు
పాల్వంచరూరల్: మండలంలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో అమ్మవారికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి జన్మస్థలం వద్ద అర్చకులు పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేకం చేయడమే కాక పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం సమర్పించి గణపతిహోమం నిర్వహించారు. అర్చకులు ప్రసాద్‌శర్మ, మూర్తిశర్మతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించండి
ములకలపల్లి/అన్నపురెడ్డిపల్లి: ఎల్‌నినో నేపథ్యాన భూగర్భ జలాలు అడుగంటే అవకాశముందని, రైతులు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని యాసంగిలో వరికి బదులు ఆరు తడి పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయాధికారి వి.బాబురావు సూచించారు. ములకలపల్లితో పాటు అన్నపురెడ్డి మండలం మండలం రాజపురం గ్రామాన్ని శుక్రవారం సందర్శించిన ఆయన రైతులతో మాట్లాడుతూ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మినుములు, పెసలు, నువ్వులు, వేరుశనగ వంటి ఆరుతడి పంటలే సాగు చేయాలని తెలిపారు. అలాగే వరి కోతల అనంతరం కొయ్యలను కాల్చొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఓలు అరుణ్‌బాబు, అనూష, ఏఈఓలు రమేష్, రాహుల్, గాంధీ, సుజాత, సంధ్యారాణి పాల్గొన్నారు.
నేడు నవోదయ
ప్రవేశపరీక్ష
కొత్తగూడెంఅర్బన్: నవోదయ విద్యాలయ సమితి ఆధ్వర్యాన ఆరో తరగతిలో ప్రవేశానికి శనివారం పరీక్ష నిర్వహిస్తున్నట్లు డీఈఓ ఎస్.శంభూప్రసాద్, కరకగూడెం జవహర్ నవోదయ విద్యాలయం ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ మోహన్ రాథోడ్ తెలిపారు. కొత్తగూడెంలో శుక్రవారం వారు వివరాలు వెల్లడించారు. నవోదయ ప్రవేశానికి 1,657మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. చర్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, భద్రాచలం కొర్రాజులగుట్ట పీఎంశ్రీ ఎస్‌ఎన్‌ఎం జెడ్పీహెచ్‌ఎస్, ఉన్నత పాఠశాల, బూర్గంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కొత్తగూడెంలోని సింగరేణి ఉన్నత పాఠశాల, సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాల, అశ్వారావుపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇల్లెందులోని సింగరేణి ఉన్నత పాఠశాలల్లో పరీక్షల కేంద్రాలు ఏర్పాటుచేయగా, తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, టాయిలెట్లు, విద్యుత్ సౌకర్యం కల్పించినట్లు వెల్లడించారు. విద్యార్థులు హాల్ టికెట్, వ్యక్తిగత ఆధార్ కార్డు, పరీక్ష ప్యాడ్, బ్లూ లేదా బ్లాక్ పెన్నుతో నిర్ణీత సమయానికి కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. సందేహాల నివృత్తికి ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ (సెల్ : 89191 93526)ను సంప్రదించాలని అన్నారు.


