కలెక్టర్ అంకిత్
చుంచుపల్లి: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కోసం అందిన దరఖాస్తుల నమోదు వేగంగా చేపట్టాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఆయన అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దరఖాస్తుల స్వీకరణ, నమోదు, నామినీ వివరాలను పరిశీలించి మాట్లాడారు. 18 – 59 ఏళ్ల వయస్సు కలిగిన వారి వివరాలు రేషన్ కార్డు ఆధారంగా నమోదు చేసి నామినీ వివరాలను సేకరించాలని అధికారులకు సూచించారు. రేషన్ కార్డులో కుటుంబసభ్యులు లేని సందర్భాల్లో కూడా ఇతర వ్యక్తులను నామినీగా ఎంపిక చేసుకునే అవకాశంపై అవగాహన కల్పించాలని తెలిపారు. గ్రామాల వారీగా షెడ్యూల్ ప్రకారం ఉదయం 9నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం పలువురు దరఖాస్తుదారులతో మాట్లాడిన కలెక్టర్ అంకిత్ వివరాలు తెలుసుకున్నారు. తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ సుభాషిణి, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.


