భద్రాచలం: గిరిజన ప్రాంతాలతో పాటు భద్రాచలం ప్రజలకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడంలో ఐటీడీఏలో ఏర్పాటు చేసిన కొత్త సబ్‌స్టేషన్ కీలకంగా నిలవనుందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ తెలిపారు. ఐటీడీఏ ప్రాంగణంలో రూ.3 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసిన 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను ఎన్పీడీసీఎల్ మోహన్‌రావుతో కలిసి పీఓ ప్రారంభించాక, చార్జ్ చేశారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ నూతన సబ్‌స్టేషన్‌తో పలు కాలనీల్లో లోఓల్టేజీ సమస్య తగ్గుతుందని చెప్పారు. అలాగే, గిరిజన రైతుల వ్యవసాయ మోటార్లు, ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీలకు మెరుగైన సరఫరా జరుగుతుందని తెలిపారు. కాగా, సబ్‌స్టేషన్ నిర్మాణానికి స్థలం కేటాయించిన పీఓ రాహుల్‌ను ఎన్పీడీసీఎల్ అధికారులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ(జనరల్) డేవిడ్‌రాజ్, సీఈ చౌహాన్, ఎస్‌ఈ మహేందర్, అధికారులు జీవన్‌కుమార్, వెంకటేశ్వర్లు, ఆనంద్‌కుమార్, గన్యానాయక్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి టీఎస్ జెన్‌కో క్రీడా పోటీలు
పాల్వంచ: పాల్వంచలోని కేటీపీఎస్ 5, 6వ దశల స్పోర్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యాన శనివారం నుంచి టీజీ జెన్‌కో ఇంటర్ ప్రాజెక్ట్ ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్ టోర్నీ నిర్వహించనున్నారు. స్థానిక విద్యుత్ కళాభారతి క్రీడా మైదానంలో మూడు రోజుల పాటు పోటీలు జరుగుతాయి. టోర్నీని జెన్‌కో డైరెక్టర్ ఎస్‌వీ.కుమార్‌రాజు ప్రారంభించనుండగా, జెన్‌కో పరిధిలోని పలు కర్మాగారాల క్రీడాకారులు హాజరవుతారు. ఈమేరకు క్రీడా మైదానంలో ఏర్పాట్లు పూర్తిచేశారు.
బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం..
న్యాయ సేవాధికారి సంస్థ జిల్లా కార్యదర్శి రాజేందర్
పాల్వంచ: జిల్లాను బాల్య వివాహ రహితంగా 2030 నాటికి తీర్చిదిద్దేలా ప్రభుత్వ యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమష్టి కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజేందర్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ బాల్య వివాహ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ సంస్థ ఆధ్వర్యాన పాల్వంచ కస్తూర్బాగాంధీ బాలికల విద్యాసంస్థలో శుక్రవారం ఏర్పాటుచేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. బాల్య వివాహాల నిర్మూలన అందరి భాగ్యస్వామ్యంతోనే సాధ్యమవుతుందని తెలిపారు. జిల్లా సంక్షేమాధికారి తార మాట్లాడుతూ బాల్య వివాహాలు ఎక్కడైనా జరుగుతున్నట్లు తెలిస్తే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు సమాచారం ఇవ్వాలని కోరారు. డీఎంహెచ్‌ఓ తుకారం రాథోడ్ మాట్లాడుతూ చిన్న వయసులో వివాహాల వల్ల బాలికల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని తెలిపారు. డీఈఓ శంభూప్రసాద్, సీఎంఓ రామారావు మాట్లాడగా, ఎస్‌ఐలు రమాదేవి, అరుణ, లేబర్ ఆఫీసర్ నాగరాజు, వివిధ సంస్థల సభ్యులు అంబేద్కర్, సందీప్, మోహన్, రవిచంద్ర, మాన్‌సింగ్, నాగేంద్రబాబు, జ్యోతి, మౌనిక తదితరులు పాల్గొన్నారు.


