రెండు మండలాల్లో అధికం
నైరుతి సీజన్‌లో జిల్లాలో భారీ వర్షపాత లోటు ఈశాన్య రుతుపవనాల వేళ ఆదుకున్న వర్షాలు
లోటు వర్షపాతంలో 9 శాతం మెరుగు..
11,091 ఎకరాల్లో పంట నష్టం
మురసుతో దెబ్బతిన్న ప్రధాన పంటల వివరాలు
తీరని నష్టం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మురసు తుపాన్ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపించింది. మూడు రోజులపాటు కురిసిన వర్షాలతో భారీగా పంట నష్టం వాటిల్లడంతోపాటు రోడ్లు కూడా దెబ్బతిన్నాయి. మరోవైపు ఈ సీజన్ సగటు వర్షపాత లోటును మురసు భారీగా తగ్గించింది.
నైరుతినై.. ఈశాన్యం జై
నైరుతి రుతుపవనాల వేళ జూన్ నుంచి అక్టోబర్ వరకు జిల్లా వ్యాప్తంగా 22.48 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో అర్నబ్, మురసు తుపాన్లతో అక్టోబర్ చివరి, నవంబర్ మొదటి వారంలో జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురిశాయి. మురసు తుపాను ప్రభావం జిల్లాపై అధికంగా కనిపించింది. జిల్లాలో 23 మండలాలు ఉండగా, 15 మండలాల్లో అతి భారీ, భారీ వర్షాలు కురిశాయి. మిగిలిన 8 మండలాల్లోనూ ఓ మోస్తరు నుంచి సాధారణ వర్షపాతం నమోదైంది. ఫలితంగా అక్టోబర్ చివరి నాటికి 22.48 శాతంగా ఉన్న లోటు వర్షపాతం నవంబర్ 5 నాటికి 12.90 శాతంగా నమోదైంది. దాదాపు 9 శాతం మేరకు లోటు భర్తీ అయింది.
పంట నష్టం
ప్రాథమిక అంచనాల ప్రకారం మురసుతో కురిసిన భారీ వర్షాల వల్ల జిల్లా వ్యాప్తంగా 11,091 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. పొట్ట దశలో ఉన్న వరి పైర్లకు అధికంగా నష్టం జరిగింది. తీత దశలో ఉన్న పత్తి రైతులు కూడా నష్టపోయారు. వరి, పత్తి తర్వాత మినుములు సాగు చేసిన రైతులకు ఎక్కువగా నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా 1,125 ఎకరాల్లో మినుము పంటకు నష్టం వాటిల్లగా, అందులో 1,120 ఎకరాలు కేవలం అశ్వారావుపేట మండలంలో ఉన్నాయి. మరో 25 ఎకరాలు ములకలపల్లి మండలంలో ఉన్నాయి. పామాయిల్‌లో అంతర పంటగా సాగవుతున్న మినుముపై మురసు ప్రభావం అధికంగా పడింది. దీనికి తోడు అశ్వారావుపేట మండలంలో పది గ్రామాల్లో 105 మంది రైతులకు చెందిన 155 ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి. పదెకరాల్లో మక్క పంటకు నష్టం జరిగింది. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఏ మేరకు ఆదుకుంటుందనేది ఇప్పుడు ప్రధాన విషయంగా మారింది.
చిన్నాభిన్నమైన రోడ్లు
ఇప్పటికే గోతులమయంగా మారిన పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ రోడ్లు తాజా వానలలతో మరింత దారుణంగా మారాయి. దమ్మపేట, అశ్వారావుపేట, ములకలపల్లి మండలాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. భారీ వరద కారణంగా ఇప్పటికే పాల్వంచ–దమ్మపేట మెయిన్ రోడ్డులో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. వర్షపు నీరు నిలవడంతో బూర్గంపాడు–భద్రాచలం–చర్ల రోడ్ల పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది.
గత నెల 29 నాటి గణాంకాల ప్రకారం జిల్లాలో 16 మండలాల్లో లోటు వర్షపాతం, ఏడు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. తాజాగా కురిసిన భారీ వర్షాలతో గణాంకాలు మారాయి. ప్రస్తుతం 10 మండలాల్లో లోటు వర్షపాతం, 11 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. అశ్వారావుపేట, చండ్రుగొండ మండలాలు అధిక వర్షపాతం కేటగిరీలోకి వెళ్లాయి. భారీ వానలు పడినా దమ్మపేట మండలం ఇప్పటికీ లోటు జాబితాలోనే ఉంది. ఇక గోదావరి తీరం వెంబడి ఉన్న మండలాల్లో చర్ల, అశ్వాపురంలలో సాధారణ వర్షపాతం ఉండగా, మిగిలిన అన్ని మండలాలు లోటు వర్షపాతంలోనే ఉన్నాయి. నవంబర్ రెండో వారంలో బంగాళాఖాతంలో మరో తుపాను ఏర్పడవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ తుపాన్ ప్రభావం ఏమైనా జిల్లా మీద కనిపిస్తే వర్షపాత లోటు మరింత కొంత తగ్గే అవకాశముంది.
అధిక ప్రభావం చూపిన అర్నబ్, మురసు తుపాన్లు
పంట విస్తీర్ణం నష్టపోయిన ప్రభావిత
(ఎకరాల్లో) రైతులు గ్రామాలు
వరి 6,504 2,991 101
పత్తి 3,297 1,547 54
మినుము 1,125 455 15


