రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
ఎస్డీఆర్‌ఎఫ్‌కు ప్రత్యేక అభినందన
దమ్మపేట: మురసు తుపాన్ కారణంగా గండ్లు పడి, దెబ్బతిన్న చెరువులకు శాశ్వత రక్షణ చర్యలు చేపడతామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సత్తుపల్లి, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, జారె ఆదినారాయణలతో కలిసి ఆయన పర్యటించారు. తొట్టిపంపు శివారులో పది మంది వ్యక్తులు వరద నీటిలో చిక్కుకుపోయిన ప్రాంతాన్ని, సమీపంలోని గండి పడిన ముసళ్లబంధం చెరువును, నీట మునిగిన వరి పంటలను పరిశీలించారు. రెస్క్యూ ఆపరేషన్ చేసి పది మంది ప్రాణాలు కాపాడిన ఎస్డీఆర్‌ఎఫ్ బృందాన్ని అభినందించి, శాలువాతో సత్కరించారు. గండుగులపల్లి శివారులో వంతెన వద్ద దెబ్బతిన్న పంటలను పరిశీలించి, నష్టంపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం దమ్మపేట పేరంటాల చెరువు గండ్లను పరిశీలించారు. అలుగు కాలువ వెడల్పు చేయాలని, సమీపంలోని వంతెన ఎత్తు పెంచాలని, కాలువ వెంబడి ఉన్న గుడిసెలను తొలగించి, వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.
పంటలకు తీవ్ర నష్టం
పరిశీలన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఏపీ సరిహద్దులోనున్న అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల్లో కురిసిన అతి భారీ వర్షాలతో ఇరిగేషన్, రోడ్లు, విద్యుత్ శాఖల పరిధితోపాటు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఎల్‌నినో ప్రభావంతో రైతులు నష్టపోతున్న క్రమంలోనే తుపాన్ రావడం విచారకరమని అన్నారు. ముంపు బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. గడిచిన 36 గంటలుగా ఎమ్మెల్యేలు, రెండు జిల్లాల కలెక్టర్లు, పోలీసులు, ఇతర శాఖల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల ఎలాంటి ప్రాణహాని జరగలేదని చెప్పారు. అనంతరం దమ్మపేటలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చిన్నశెట్టి చిట్టిబాబు వివాహ వేడుకలకు హాజరై ఆశీర్వదించారు. కార్యక్రమంలో కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళి, ఇరిగేషన్ సీఈ శ్రీనివాసరెడ్డి, అశ్వారావుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్, కాంగ్రెస్ నాయకులు పగడాల రాంబాబు, పర్వతనేని ప్రసాద్, చిన్నశెట్టి యుగంధర్, యర్రగొర్ల రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


