కథ సుఖాంతం ! | - | Sakshi
Sakshi News home page

కథ సుఖాంతం !

Nov 6 2026 12:38 AM | Updated on Nov 6 2026 12:38 AM

బేతుపల్లి వరదలో గల్లంతైన అందరూ క్షేమం

ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, మత్స్యకారులు సురక్షితంగా బయటకు

12గంటలకు పైగా కొనసాగిన

రెస్క్యూ ఆపరేషన్‌

సత్తుపల్లి: క్షణక్షణం ఉత్కంఠ.. గంటల తరబడి నిరీక్షణ.. అధికారుల సూచనలు.. కుటుంబీకుల్లో ఆందోళన.. ఇదీ సత్తుపల్లిలోని బేతుపల్లి చెరువు వద్ద బుధవారం రాత్రి 7గంటల నుంచి గురువారం ఉదయం 7గంటల వరకు నెలకొన్న పరిస్థితి. బేతుపల్లి చెరువు వరదలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించేందుకు వెళ్లిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది బోట్లు బోల్తా పడడంతో అందరూ గల్లంతు కాగా ఆందోళన నెలకొంది. ఈక్రమాన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం రంగంలోకి దిగడం, ఖమ్మం కలెక్టర్‌ దివాకర, భద్రాద్రి ఎస్పీ రోహిత్‌రాజ్‌ పర్యవేక్షణలో 12గంటల రెస్క్యూ ఆపరేషన్‌ అనంతరం ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అందరూ సురక్షితంగా బయటకు రావడంతో ఉత్కంఠకు తెరపడింది. గంటల తరబడి సహాయక చర్యలను పర్యవేక్షించిన అధికారులపై అభినందనలు వెల్లువెత్తగా.. వరద నుంచి బయటపడిన సిబ్బంది కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు.

కలెక్టర్‌.. రాత్రంతా క్షేత్రస్థాయిలోనే

బేతుపల్లి చెరువు వరదలో ఎనిమిది మంది మత్స్యకారులు బొంతల రమేష్‌, పొదిలి శ్రీనివాసరావు, రామయ్య, పొదిలి అర్జున్‌రావు, కుంచపు మారేశ్వరరావు, వల్లెపు మనోజ్‌, ఇనుముల అనిల్‌, నీలాల గిరి చిక్కుకున్నారనే సమాచారం అందిన వెంటనే కలెక్టర్‌ దివాకర చెరువు వద్దకు చేరుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చాతకొండ బెటాలియన్‌ నుంచి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రాగానే సహాయక చర్యలు ప్రారంభించారు. రెవెన్యూ, ఫైర్‌, పోలీస్‌ అధికారులను కలెక్టర్‌ సమన్వయపరుస్తుండగా తొలుత బోట్‌లో వెళ్లిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ముగ్గురు మత్స్యకారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత మరో రెండు బోట్లలో పది మంది సిబ్బంది, ఒక మత్స్యకారుడు గైడ్‌గా వెళ్లాడు. అయితే, ఆ రెండు బోట్లు వరద ఉధృతితో బోల్తా పడి అంతా గల్లంతవడంతో భద్రాద్రి ఎస్పీ రోహిత్‌రాజ్‌తో కలిసి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని రంగంలోకి దించారు.

తొలి ప్రాధాన్యత మత్స్యకారులకే..

రెండు బోట్లు బోల్తాపడగా ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందంలోని ఎస్సై, సిబ్బంది మురళి, నరేష్‌, వేణు, సీతయ్య, కాశీరామ్‌, బాలాజీ, నల్లమోతు రాజ, నజీర్‌ యాసిన్‌, వెంకట్రామిరెడ్డి, నజర్‌ వలీ గల్లంతయ్యారు. అయితే, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సుశిక్షితులు కావడంతో... ధైర్యంగా చెప్పుకుంటూ విజయవాడ నుంచి వచ్చిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని రెండు బోట్లలో పంపించారు. అయితే, తొలి ప్రాధాన్యత ఐదుగురు మత్స్యకారులను రక్షించడానికే ఇచ్చారు. దీంతో బుధవారం రాత్రి 11–15 గంటలకు మత్స్యకారులను ఒడ్డుకు చేర్చడంతో ఒక అంకం ముగిసింది.

అసలు టాస్క్‌ అప్పుడే మొదలైంది..

పది మంది ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, దారి చూపించడానికి వెళ్లిన మత్స్యకారుడు బెజవాడ ధర్మరాజును రక్షించేందుకు ఎస్పీ రోహిత్‌రాజ్‌తో కలిసి ఫోన్‌ ట్రాకింగ్‌ చేస్తూ రక్షించేందుకు ఉన్న మార్గాలపై కలెక్టర్‌ చర్చించారు. కాకర్లపల్లి శివాలయం మీదుగా లాక్‌ల వద్దకు వెళ్లి బేతుపల్లి ప్రత్యామ్నాయ మార్గంలో ఉన్న ఫోన్‌ సిగ్నళ్లు గుర్తించడంతో వారి ఆచూకీ తెలిసింది. దీంతో గురువారం తెల్లవారుజామున 4–30 గంటల నుంచే ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని అప్రమత్తం చేసి వారిని రక్షించేందుకు సిద్ధమయ్యారు. ఈమేరకు ఉదయం 7–15గంటలకు వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం.. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా రెస్క్యూ ఆపరేషన్‌ ముగియడంతో అప్పటికే అక్కడకు చేరుకున్న మంత్రులు పొంగులేటి, తుమ్మల తదితరులు కలెక్టర్‌ దివాకరను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement