పాల్వంచరూరల్: మండలంలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువైన శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు జరిగాయి. పెద్దమ్మతల్లి అర్చకులు 108 సువర్ణ పుష్పాలతో అర్చన చేయడమే కాక హారతి, మంత్రపుష్పం సమర్పించారు. పూజల్లో ఆలయ ఈఓ విజయ్‌కుమార్, అర్చకులు, వేదపండితులు పద్మనాభశర్మ, ప్రసాద్ శర్మ పాల్గొన్నారు.
వృద్ధుల హక్కుల పరిరక్షణకు లీగల్ ఎయిడ్ క్లినిక్
జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ
కార్యదర్శి రాజేందర్
సూపర్‌బజార్(కొత్తగూడెం): వృద్ధుల హక్కుల పరిరక్షణకు, వారికి న్యాయ సహాయం అందించేందుకు వృద్ధుల హక్కుల పరిరక్షణకు లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటు చేసినట్లు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ తెలిపారు. గురువారం కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ న్యాయ సహాయ కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. వృద్ధులకు ఆస్తి సంబంధిత సమస్యలు, పిల్లల ద్వారా నిర్లక్ష్యం, పోషణ, సంరక్షణకు సంబంధించిన సమస్యలు ఎదురైనప్పుడు న్యాయ సహాయం అంఇస్తామని తెలిపారు. డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పి.నిరంజన్ రావు, అసిస్టెంట్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్స్ పావని, సాహితి, ఆర్డీఓ కార్యాలయ డిప్యూటీ ఏఓ లక్ష్మణ్, పారా లీగల్ వలంటీర్లు భారతి, రాజకుమారి, జానకీరామ్, వీరభద్రం, లీగల్ సర్వీసెస్ సిబ్బంది పాల్గొన్నారు.
బాధ్యతలు చేపట్టిన
జడ్జి రాంప్రసాదరావు
కొత్తగూడెంఅర్బన్: జిల్లా ఒకటో అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా డి.రాంప్రసాదరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. రంగారెడ్డి జిల్లా 6వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా పనిచేస్తున్న ఆయన బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా న్యాయమూర్తిని జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కిరణ్ కుమార్ ముదల్కర్, ప్రధాన కార్యదర్శి మహేష్ గడిపెల్లి, కార్యవర్గ సభ్యులు గడదాసు నాగరాజు, దొడ్డ ప్రసాద్, బానోత్ దేవదాస్‌లు కలిసి పుష్పగుచ్ఛం అందించారు.
శతరాగ దాశరథి
గ్రంథావిష్కరణ
భధ్రాచలం: భక్త రామదాసు రచించిన భక్తి సాహిత్య సంపద దాశరథీ శతకానికి సంగీత రూపంలో గుర్తింపు తీసుకువచ్చే అరుదైన ప్రయత్నం జరిగింది. గాయని జి. శ్రీరామరత్న శతకంలోని 103 పద్యాలను 103 విభిన్న రాగాల్లో స్వరపరిచారు. స్వర వివరాలు, పద్య తాత్పర్యాలతో కలిపి ‘శతరాగ దాశరథి’ పేరిట విశిష్ట గ్రంథాన్ని రూపొందించగా, శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఈఓ కె.దామోదర్ రావు గురువారం ఆలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ భక్తి సాహిత్యాన్ని సంగీతంతో అనుసంధానిస్తూ భావితరాలకు అందించే ప్రయత్నం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఆలయ పర్యవేక్షకుడు లింగాల సాయిబాబా, రామాయణ పారాయణదారు ఎస్‌టీజీ అంతర్వేది కృష్ణమాచార్యులు పాల్గొన్నారు.


