సూపర్‌బజార్(కొత్తగూడెం): మురసు తుపాన్ ప్రభావంతో వివిధ శాఖల పరిధిలో సంభవించిన నష్టాలపై సమగ్ర అంచనాలు సిద్ధం చేయాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. గురువారం అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో తుపాన్ ప్రభావం, జరిగిన నష్టాలు, చేపట్టిన పునరుద్ధరణ చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ తుపాన్ వల్ల జరిగిన నష్టాలపై సమగ్ర వివరాలను నిర్దేశిత గడువులోగా అందజేయాలన్నారు. క్షేత్రస్థాయిలో నష్టాలను పరిశీలించి, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వివరాలను నమోదు చేయాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారి ప్రాథమిక నివేదిక ప్రకారం సుజాతనగర్ మండలంలో కూరగాయల పంటలు, దమ్మపేట మండలంలో ఆయిల్‌పామ్ పంటలకు నష్టం జరిగిందని తెలిపారు. 100 విద్యుత్ స్తంభాలు, ఏడు చెరువులు దెబ్బతిన్నాయని, అశ్వారావుపేటలో సుమారు 20 ఇళ్లు దెబ్బతిన్నాయని ఆయా శాఖల అధికారులు వివరించగా, నివేదిక అందించాలని కలెక్టర్ ఆదేశించారు. మున్సిపాలిటీలో రెగ్యులర్ ఏఈ నియమించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు జరిగిన నష్టాల వివరాలను సేకరించాలన్నారు.
ఎమ్మెల్సీ ఓటరు దరఖాస్తుల పరిశీలన
వేగవంతం చేయాలి
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కోసం అందిన ఫారం–18 దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి గురువారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ అంకిత్ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఓటరు దరఖాస్తుల పరిశీలన 15 రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులు, యువతకు ఓటు హక్కు, ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాధాన్యతపై అవగాహన కల్పించాలని సూచించారు. అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, కొత్తగూడెం ఆర్డీఓ మధు, ఎన్నికల సూపరింటెండెంట్ రంగా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అంకిత్


