భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో గురువారం రామయ్య నిత్యకల్యాణం కనుల పండువగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి రామసేవా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.
పెద్దమ్మతల్లికి
సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి వైభవంగా సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో గురువారం అర్చకులు అమ్మవారికి 108 సువర్ణ పుష్పాలతో అర్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ విజయ్‌కుమార్, వేదపండితుడు పద్మనాభశర్మ పాల్గొన్నారు.
న్యాయమూర్తి బదిలీ
సూపర్‌బజార్(కొత్తగూడెం): గత సంవత్సరం నుంచి కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా పనిచేస్తున్న ఎస్.సరితను రంగారెడ్డి జిల్లా 6వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా బదిలీ చేస్తూ గురువారం ఆదేశాలు జారీ అయ్యాయి. ఆమె స్థానంలో డి.రాంప్రసాదరావును నియమించారు. నవంబర్ 5వ తేదీ లోగా విధుల్లో చేరాలని ఆదేశించారు.
దరఖాస్తుల ఆహ్వానం
చుంచుపల్లి: భద్రాచలంలోని ప్రాంతీయ ఆస్పత్రిలో గైనకాలజిస్టు పోస్టుకు ఒప్పంద పద్ధతిలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీసీహెచ్‌ఓ డాక్టర్ రవిబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నెలకు రూ.2 లక్షల వేతనం చెల్లిస్తామని, అభ్యర్థులు నవంబర్ 4వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను కలెక్టరేట్‌లోని జిల్లా ఆస్పత్రుల ప్రధాన కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.
రికార్డులు
అప్‌డేట్ చేయాలి
పాల్వంచరూరల్: గ్రామ పంచాయతీల రికార్డులను అప్‌డేట్ చేయాలని జిల్లా పంచాయతీ అధికారి అనూష పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. మండల పరిధిలోని రంగాపురం, నాగారం గ్రామాలను గురువారం ఆమె సందర్శించారు. గ్రామ పంచాయతీల క్రిమిటోరియం, నర్సరీలు, డంపింగ్ యార్డులు, అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం, రికార్డులను తనిఖీ చేశారు. పలు సూచనలు చేశారు. అనంతరం నాగారం గ్రామంలోని జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఎంపీఓ షేక్ శబ్నా, సర్పంచ్‌లు మాలోతు అనూష, దారవత్ స్వప్న పాల్గొన్నారు.
సరాసరి వర్షపాతం
20 మి.మీ
సూపర్‌బజార్(కొత్తగూడెం): తుపాన్ ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికలు తారుమారయ్యాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం వరకు కురిసిన వర్షం అధికారిక గణాంకాల ప్రకారం.. జిల్లా సరాసరి 20 మి.మీ వర్షపాతం నమోదైంది. అధికంగా అశ్వారావుపేటలో 73 మి.మీ వర్షపాతం నమోదు కాగా గుండాలలో అల్పంగా 3.6 మి.మీ వర్షపాతం నమోదైంది. కరకగూడెంలో 11.4 మి.మీ, పినపాక 12, చర్ల 14.6, దుమ్ముగూడెం 15.2, అశ్వాపురం 16.4, మణుగూరు 19.4, ఆళ్లపల్లి 8.2, గుండాల 3.6, ఇల్లందు 8.2, టేకులపల్లి 9.2, జూలూరుపాడు 11.4, చండ్రుగొండ 25, అన్నపురెడ్డిపల్లి 31.2, చుంచుపల్లి 14.2, సుజాతనగర్ 17.4, కొత్తగూడెం 21.6, లక్ష్మీదేవిపల్లి 16.2, పాల్వంచ 21.6, బూర్గంపాడు 26.2, భద్రాచలం 16.4, ములకలపల్లి 28.4, దమ్మపేట 38.4, అశ్వారావుపేటలో 73.6 మి.మీ వర్షపాతం నమోదైంది.


