సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజా సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం ఆయన కొత్తగూడెంలోని రైటర్ బస్తీ గొల్లగూడెంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం తన క్యాంప్ కార్యాలయంలో అదనపు కలెక్టర్, ఆర్డీఓ, రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి, రెవెన్యూ అనుమతులు, ఇతర సాంకేతిక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత పార్టీ శ్రేణుల ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని, పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పలువురు అధికారులు, కార్యకర్తలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగూడెంలో ఓ వివాహ వేడుకకు కూడా హాజరయ్యారు. 1987లో ఏలూరు సీఆర్ రెడ్డి లా కళాశాలలో తనతో కలిసి న్యాయవిద్యను అభ్యసించిన పదిమంది మిత్రులను కలుసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో డీసీసీ అధ్యక్షురాలు తోట దేవీ ప్రసన్న, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతా రాములు, నాయకులు ఆళ్ల మురళి, చంద్రశేఖర్ రావు, ఊకంటి గోపాలరావు, కోనేరు సత్యనారాయణ, నాగేంద్ర త్రివేది, రజాక్, చింతలపూడి శేఖర్, డిప్యూటీ మేయర్ సిరిపురం లలిత, కార్పొరేటర్ జల్లి శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీనారాయణ కుటుంబానికి అండగా ఉంటాం
పాల్వంచ: పాల్వంచ హెచ్‌పీ గ్యాస్ గోదాం మేనేజర్ అనంతుల లక్ష్మీనారాయణ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి భరోసా ఇచ్చారు. గురువారం లక్ష్మీనారాయణ దశదిన కార్యక్రమం నిర్వహించగా, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కలెక్టర్ అంకిత్‌లతో కలిసి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, తహసీల్దార్ దారా ప్రసాద్, డీఎస్పీ సతీష్ తదితరులు పాల్గొన్నారు.


