దాఖలు చేసిన గ్యాస్ గోదాం మేనేజర్ ఆత్మహత్య కేసు నిందితులు
భద్రాచలంఅర్బన్: పాల్వంచ గ్యాస్ గోదాం మేనేజర్ అనంతుల లక్ష్మీనారాయణ ఆత్మహత్య కేసులో నిందితులుగా ఉన్న నలుగురు జర్నలిస్టులతోపాటు ఓ మహిళ ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో రాజులపూడి రజితతోపాటు జర్నలిస్టులు ఎల్.రాజేష్, నాగచంద్రరావు అలియాస్ నాగచందు, మహ్మద్ అబ్దుల్ ఖలీం ఈ నెల 26న ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే కేసులో ఆరో నిందితుడిగా పేర్కొన్న జర్నలిస్టు తలారి రవికుమార్ సైతం విడిగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ రెండు పిటిషన్లపై నవంబర్ 3న విచారణ జరగనుంది. కాగా ఇటీవల ఓ మహిళతోపాటు మరో ఇద్దరు జర్నలిస్టులను ఉమ్మడి కరీంనగర్‌లో, మరో ముగ్గురు జర్నలిస్టులను తమిళనాడు రాష్ట్రంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతున్నా పోలీసులు అధికారికంగా వెల్లడించలేదు.
చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్
అశ్వాపురం: వృద్ధురాలి మెడలో బంగారం చోరీ చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్‌స్టేషన్‌లో గురువారం సీఐ ఎల్ల య్య వెల్లడించిన వివరాల ప్రకారం.. గత నెలలో వృద్ధురాలు బొల్లు సరోజనమ్మ ఇంట్లోకి తెల్లవారుజామున దొంగలు చొరబడి 3 తులాల బంగారు గొలుసు, రూ.50 వేల నగదు అపహరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నెల 28న మండల పరిధిలోని గొల్లగూడెం క్రాస్ రోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా బైక్‌పై వెళ్తున్న ముగ్గురు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని పట్టుకుని విచారించగా సీతారాంపురంలో చోరీ చేసినట్లు అంగీకరించారు. చుంచుపల్లి పరిధిలో మరో చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితులు ఒడిశాకు చెందిన రేవు సురేష్, సల్బం చిన్నా, ఏపీలోని ఎటపాక మండలం మురుమూరుకు చెందిన గొంది ముత్తయ్యలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై శివరామకృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
సర్క్యులర్‌ను
నిలుపుదల చేయాలి
రుద్రంపూర్: అండర్ గ్రౌండ్స్ లీవ్ రికవరీ సర్క్యులర్‌ను నిలుపుదల చేయాలని సీఐటీయూ అధ్యక్షుడు మందా నర్సింహారావు గురువారం ఒక ప్రకటనలో సింగరేణి యాజమాన్యాన్ని కోరారు. అండర్ గ్రౌండ్ కార్మికులను సంస్థ అవసరాల రీత్యా డిప్యూటేషన్‌పై సర్ఫేస్‌లో వినియోగించుకుంటున్నారు. ఇలా పనిచేస్తున్న కార్మికుల వేతనాల్లో 2014 నుంచి ఇప్పటివరకు జమైన అండర్ గ్రౌండ్ అలవెన్స్ రికవరీ చేయాలని సర్క్యులర్ జారీ చేయడం సరికాదని పేర్కొన్నారు. కార్మికులను ఇబ్బంది పెట్టడం మాని సంస్థకు రావాల్సిన రూ.56 వేల కోట్ల బకాయిల వసూళ్లపై శ్రద్ధ పెట్టాలని కోరారు.
బొగ్గు టిప్పర్, బైక్ ఢీ
యువకుడు అక్కడికక్కడే మృతి
రుద్రంపూర్: చండ్రుగొండ మండలం తిప్పనపల్లి శివారు ప్రాంతంలో గురువారం రాత్రి ద్విచక్రవాహనాన్ని బొగ్గుటిప్పర్ ఢీకొని ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. కొత్తగూడెం నుంచి వస్తున్న బొగ్గు టిప్పర్ చండ్రుగొండ వైపు నుంచి వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న యువకుడు తీవ్ర గాయాలై సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడు వనపర్తి వాసిగా తెలిసింది. కాగా ద్విచక్రవాహనం పూర్తిగా నుజునుజ్జుయింది.
మధిరలో
అఘోర సాధువు
మధిర: ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌కు చెందిన అఘోర సాధువు బాబా ప్రేమ్‌గిరి గురువారం మధిరకు వచ్చారు. ఈ సందర్భంగా అంబికా ఫ్యాన్సీ షాప్‌తో పాటు పలు వ్యాపార సంస్థలకు వెళ్లగా, ఇంకొందరు తమ షాపులకు తీసుకెళ్లి ఆశీర్వాదాలు పొందారు. కాగా, అఘోర సాధువును చూడడానికి స్థానికులు ఆసక్తి కనబరిచారు.
నిందితుడి బైండోవర్
సూపర్‌బజార్(కొత్తగూడెం): పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న కొత్తగూడేనికి చెందిన ఆటో డ్రైవర్ భూపతి భరత్ (37)ను గురువారం తహసీల్దార్ ఎదుట హాజరుపర్చి బైండోవర్ చేశారు. భరత్ పేకాట ఆడిస్తున్నట్లు గుర్తించామని, గతంలో వేర్వేరు పోలీస్ స్టేషన్ల పరిధిలో పేకాట, ఇతర నేరాలకు సంబంధించి కేసులు కూడా ఉన్నాయని లక్ష్మీదేవిపల్లి ఎస్‌ఐ అఖిల తెలిపారు. అతని ప్రవర్తనపై నిఘా ఉంచి భవిష్యత్తులో ఎలాంటి నేరాలకు పాల్పడకుండా నిరోధించేందుకు బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు.


