● రెండో రోజుకు చేరిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ● నేడు సెమీస్, ఫైనల్స్
సత్తుపల్లి: సత్తుపల్లిలో 73వ రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. రెండో రోజైన గురువారం వర్షం లేకపోవడం, వాతావరణం పొడిగా మారడంతో పోటీలను తిలకించేందుకు క్రీడాభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ – మువ్వా విజయ్‌బాబు యూత్ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న ఈ పోటీలకు 33 జిల్లాల నుంచి 34 జట్లు హాజరయ్యాయి. ఈమేరకు 71 లీగ్ మ్యాచ్‌లను 12 పూల్స్‌గా విభజించారరు. లీగ్ మ్యాచ్‌లు చివరి దశకు చేరడంతో గురువారం ప్రతీ మ్యాచ్ ఉత్కంఠగానే సాగింది.
నేడు టోర్నీ ముగింపు
టోర్నీలో భాగంగా బుధ, గురువారం లీగ్ మ్యాచ్‌లు నిర్వహించారు. ఇక చివరి రోజైన శుక్రవారం ప్రీ క్వార్టర్, సెమీ ఫైనల్స్, ఫైనల్స్ పోటీలు జరుగుతాయి. ఈమేరకు 16జట్ల నుంచి ఎనిమిది, ఆపై నాలుగు, ఆతర్వాత రెండు జట్లను ఫైనల్స్ ఎంపిక చేస్తారు. పెద్దసంఖ్యలో హాజరవుతున్న అభిమానులు ఇబ్బంది పడకుండా భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కాగా, శుక్రవారం జరిగే ముగింపు వేడుకలకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరై విజేతలకు బహుమతి ప్రదానం చేస్తారని టీజీఐడీసీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు వెల్లడించారు. అలాగే, కలెక్టర్ దివాకర టీ.ఎస్., సీపీ సునీల్‌దత్, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ తదితరులు హాజరవుతారని తెలిపారు. ఈకార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కటికల క్రిస్టోఫర్ బాబు, రాష్ట్ర, జిల్లా నాయకులు కె.స్వాతిముత్యం, సీహెచ్.సుధాకర్, మందపాటి ముత్తారెడ్డి, చల్లగుళ్ల నర్సింహారావు, తోట సుజలరాణి, గాదె చెన్నారావు, ఎం.డీ.కమల్ పాషా, మట్టా ప్రసాద్, ఎస్.కే.మౌలాలి, కూకులకుంట దయాకర్, పీఈటీలు, పీడీలు పాల్గొన్నారు.
రెండో రోజు పోటీల వివరాలు
కబడ్డీ పోటీలలో పాల్గొన్న ప్రతీ క్రీడాకారురాలికి ప్రత్యేక బహుమతి, జ్ఞాపిక, సర్టిఫికెట్ అందిస్తున్నారు, కాగా, రెండో రోజైన గురువారం జరిగిన మ్యాచ్‌ల్లో హనుమకొండపై సిద్దిపేట, ఆదిలాబాద్‌పై హైదరాబాద్, యాదాద్రి భువనగిరి జట్టుపై రంగారెడ్డి, నిర్మల్ జట్టుపై వరంగల్ జట్టు గెలిచింది. అలాగే, సంగారెడ్డి జట్టుపై ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లిపై నల్లగొండ, హైదరాబాద్–1 జట్టుపై జనగామ, హనుమకొండపై ఆసిఫాబాద్, కరీంనగర్‌పై భద్రాద్రి కొత్తగూడెం జట్టు విజయం సాధించింది. ఇక సిరిసిల్ల జట్టుపై సిద్దిపేట, మెదక్‌పై సూర్యాపేట, ములుగుపై మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌పై నిజామాబాద్, నారాయణపేటపై జగిత్యాల, మంచిర్యాలపై వనపర్తి, సిద్దిపేట జట్టుపై జోగుళాంబ గద్వాల జిల్లా జట్టు గెలిచింది.


