100 మందిని మోసం
● సైఫాబాద్ పోలీసుస్టేషన్‌లో నమోదు ● సైదాబాద్‌లో విచారణ పూర్తి ● ఖైరతాబాద్ కేసులో సాగుతున్న దర్యాప్తు
ఖైరతాబాద్: సోషల్‌మీడియా వేదికగా యువతి ఫొటో, పేరుతో చాటింగ్ చేసి... ఆపై ఆమె అన్నగా మారి... పలువురిని బెదిరించి రూ.లక్షల్లో వసూలు చేసిన ‘హనీట్రాప్ కేసు’ నిందితుడు పవన్‌కుమార్‌పై మరో కేసు నమోదైంది. దీంతో ఆయనపై నమోదైన కేసుల సంఖ్య మూడుకు చేరింది. ఇప్పటికే పవన్‌ను అరెస్టు చేసిన సైదాబాద్ పోలీసులు కోర్టు అనుమతితో మూడు రోజులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఆ గడువు గురువారంతో ముగియడంతో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా సైఫాబాద్ ఠాణాలో మరో కేసు నమోదు చేశారు.
ఖైరతాబాద్ డీఐ బాలస్వామి
భార్య ఫిర్యాదుతో..
పవన్ గతంలో బషీర్‌బాగ్‌లోని ఓ సంస్థలో విధులు నిర్వర్తించాడు. అప్పట్లో ఆ సంస్థ నుంచి రూ.30 వేలు అడ్వాన్స్‌గా తీసుకుని రూ.14 వేలే చెల్లించడంతో సంస్థ బాధ్యుల ఫిర్యాదుతో సైఫాబాద్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. మరోపక్క ఇటీవల అరెస్టు అయిన ఖైరతాబాద్ డీఐ బాలస్వామి భార్య ఫిర్యాదుతో ఆ ఠాణాలో నమోదైన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తన భర్త బాలస్వామి భవానీనగర్ ఠాణాలో ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తుండగా చందన పేరుతో పవన్ ట్రాప్ చేశాడని, ఆపై ఆమెకు అన్నగా మారి ఆరు నెలల పాటు వేధించాడనేది ప్రధాన ఆరోపణ. బాలస్వామి ఖైరతాబాద్ డీఐగా బదిలీపై వచ్చినా వదలకుండా, దాదాపు ఆరు నెలల పాటు ఓ లాడ్జిలో తన భర్తతో కలిసి ఉన్నాడని పేర్కొన్నారు. బాలస్వామి ఇంటికి కూడా రాకుండా నిర్బంధించాడని వివరించారు. ఇలా దఫదఫాలుగా తన భర్త నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చివరకు ఈ నెల 4న తన భర్త ఇంటికి వచ్చేయగా బెదిరింపులకు దిగాడని ఆరోపించారు. దీనిపై ఖైరతాబాద్ ఠాణాలో కేసు నమోదైంది. ఇటీవల ఓ కేసులో అరెస్టు అయిన బాలస్వామి ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో ఆయన నుంచి వాంగ్మూలం నమోదు చేసిన తర్వాతే ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోవాలని ఖైరతాబాద్ పోలీసులు నిర్ణయించారు. బాలస్వామి వాంగ్మూలం జైలులో నమోదు చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోపక్క తుకారాంగేట్ ప్రాంతానికి చెందిన ఓ యువతి నుంచి పవన్ కుమార్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో రూ.6 లక్షలు తీసుకుని మోసం చేశారని పోలీసులు గుర్తించారు. దీనిపై త్వరలో ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముత్యాలంపాడుకు చెందిన కొండాబత్తుల పవన్ కుమార్(23) కూకట్‌పల్లి బాలాజీనగర్‌లో నివసించాడు. నకిలీ ఖాతాలతో సామాజిక మాధ్యమాల ద్వారా యువతి మాదిరి పలువురితో చాటింగ్ చేశాడు. ఈ క్రమాన ‘వ్యక్తిగత సంభాషణలు’ చేస్తూ వారి ఫొటోలు సేకరించి భద్రపరిచేవాడు. ఆపై ఆ యువతి అన్నలా వారిని కలిసి ఫొటోలు బయటపెడతానని బెదిరించి వసూళ్లకు పాల్పడ్డాడు. సైదాబాద్ పరిధిలో నివసించే అతని స్నేహితుడిని సైతం ఇలానే మోసగించాడు. ఆయన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైదాబాద్ పోలీసులు ఈ నెల 19న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రాథమిక విచారణలో భాగంగా దాదాపు 100 మందిని మోసం చేసినట్లు గుర్తించిన అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా నిందితుడిని కస్టడీలోకి తీసుకుని విచారించారు. అతడికి చెందిన ఓ బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.2 లక్షల నగదు ఫ్రీజ్ చేశారు.


