భద్రాచలంటౌన్: అమెరికాలో జరిగిన అంతర్జాతీయ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో రజత, కాంస్య పతకాలు సాధించిన భద్రాచలానికి చెందిన 74 ఏళ్ల డీ.వీ.శంకర్‌రావును రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకాటి శ్రీహరి అభినందించారు. కోచ్, పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా జనరల్ సెక్రటరీ జీ.వీ.రామిరెడ్డితో కలిసి శంకర్‌రావు మంత్రిని హైదరాబాద్‌లో బుధవారం కలిశారు. యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచారని మంత్రి కొనియాడారు. ఆర్థిక సాయం కోసం అందిన దరఖాస్తును త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బోగాల శ్రీనివాస్‌రెడ్డితో పాటు రసమల్ల రాము, పూనెం ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
విపత్తుల నివారణపై ముగిసిన శిక్షణ
భద్రాచలంఅర్బన్: తుపానుల సమయంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, విపత్తుల ప్రభావాన్ని తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యలపై జిల్లా అధికారులు మూడు రోజులపాటు శిక్షణ పొందారు. విజయవాడ సమీపంలోని గన్నవరం పరిధిలో గల కొండపావులూరులో ఉన్న జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌ఐడీఎం) దక్షిణ ప్రాంత క్యాంపస్‌లో ఈ నెల 26 నుంచి 28 వరకు శిక్షణ కొనసాగింది. శిక్షణ పొందినవారిలో భద్రాచలం గ్రామపంచాయతీ అధికారి సీహెచ్.శ్రీనివాసరావు, మణుగూరు మున్సిపల్ కమిషనర్ టి.ప్రసాదరావుతో పాటు జిల్లాలోని వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
భారజల కర్మాగారాన్ని
సందర్శించిన బోర్డు చైర్మన్
అశ్వాపురం: మణుగూరు భారజల కర్మాగారాన్ని భారజల బోర్డు సీఈ వీవీఎస్‌ఏ ప్రసాద్ సందర్శించారు. మంగళవారం రాత్రి గౌతమీనగర్ కాలనీలోని అతిథి గృహంలో బస చేసిన ఆయన బుధవారం కర్మాగారాన్ని సందర్శించారు. అడ్మినిస్ట్రేటివ్ భవనంలో వివిధ విభాగాల అధికారులతో సమావేశాలు నిర్వహించారు. మణుగూరు కర్మాగారంలో రెండు యూనిట్లు ఉండగా, మూడో యూనిట్ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. యూనిట్ ఏర్పాటు, ఆక్సిజన్–18 ప్లాంటుకు సంబంధించిన పలు అంశాలపై అధికారులతో చర్చించారు. గురువారం కూడా అధికారులతో సమావేశం కానున్నారు. తొలుత హోమి జే బాబా విగ్రహానికి నివాళులర్పించారు. కాగా, ఆయన గతంలో ఇక్కడ డీజీఎంగా పనిచేశారు. ఇన్‌చార్జ్ జీఎం రఫీక్ అహ్మద్, డీజీఎం జగన్నాథ్, సీఈఓ లక్ష్మదేవి, ఏడీఎంఓ జైసన్, ఐఆర్‌ఓ కృష్ణకాంత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
జాతీయ పోటీలకు
ఆరుగురు ఎంపిక
రుద్రంపూర్: ఈ నెల 17,18,24వ తేదీల్లో హైదరాబాద్‌లో జరిగిన మణిపూర్ సంప్రదాయ యుద్ధకళ (తుంగ్–టా)లో జిల్లాకు చెందిన ఆరుగురు క్రీడాకారులు వెంకట హాసిని, సౌమ్యశ్రీ, సభిహా మునాజ, ఏ జస్వంతి, ఎండీ హర్సీయా, ఈసం వెంకట రేవంత్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. జాతీయ స్థాయికి అర్హత సాధించి ఖేలో ఇండియా పోటీలకు ఎంపికయ్యారు. వీరితోపాటు అజయ్ కుమార్, టి.గోపి, ఎస్.భార్గవ్, చింత శ్వేత, ఈసం శృతిక, హరీషియా, మైమూన్, లాిస్య కూడా పతకాలు సాధించారు. ఈ సందర్భంగా విజేతలను ఎస్‌జీఎఫ్‌ఐ స్కూల్స్ గేమ్స్ సెక్రటరీ భావ్‌సింగ్ అభినందించారు.
ముగిసిన అంతర్ కళాశాలల క్రీడా పోటీలు
బాల్‌బ్యాడ్మింటన్ రన్నరప్‌గా కొత్తగూడెం
కేయూ క్యాంపస్: హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న కేయూ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని అంతర్ కళాశాలల క్రీడాపోటీలు బుధవారం ముగిశాయి. కబడ్డీ, బాల్‌బ్యాడ్మింటన్, హ్యాండ్‌బాల్, చెస్, క్రాస్ కంట్రీ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. బాల్‌బ్యాడ్మింటన్ పోటీల్లో హనుకొండ వాగ్దేవి కళాశాల జట్టు విజేతగా, కొత్తగూడెం ఎంజీపీఆర్‌డీసీ జట్టు రన్నరప్‌గా నిలిచింది. క్రీడాకారులకు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి బహుమతులు అందజేశారు.
మహారాష్ట్రకు
ఐరన్ ఫ్రేమ్‌ల తరలింపు
భద్రాచలంఅర్బన్: భద్రాచలం వద్ద గోదావరిపై నిర్మించిన రెండో వంతెన నిర్మాణ పనుల్లో వినియోగించిన భారీ ఐరన్ ఫ్రేమ్‌లను మహారాష్ట్రకు తరలిస్తున్నారు. వంతెన నిర్మాణ సమయంలో ఉపయోగించిన వీటిని లారీలపై క్రేన్ సహాయంతో లోడ్ చేసి గోదాముకు తరలిస్తున్నట్లు నిర్మాణ బాధ్యులు తెలిపారు.


