లోక్ రక్షక్ పార్టీ అధ్యక్షుడు కొండా చరణ్
చర్ల: అవినీతి అధికారులు తీరు మార్చుకోవాలని లోక్ రక్షక్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండా చరణ్ అన్నారు. బుధవారం చర్లలో పార్టీ మండల అధ్యక్షుడు షేక్ జహీరుద్దీన్ భాషా ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కొందరు సామాన్య ప్రజల నుంచి బహిరంగంగా లంచాలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బంది వ్యవహారశైలిపై నిఘా పెట్టాలని సూచించారు. లోక్ రక్షక్ పార్టీ నాయకులు చిట్టిమల్ల సుజాత, గుర్రాల విజయ్‌కుమార్, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మిస్సింగ్ కేసు నమోదు
ఇల్లెందురూరల్: తన భార్య అరుణ, ఇద్దరు పిల్లలు కనిపించడం లేదని మండలంలోని ఒడ్డుగూడెం గ్రామపంచాయతీ నెహ్రూనగర్‌కు చెందిన బానోత్ లచ్చు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బుధవారం ఉదయం ఏడు గంటలకు ఇంటి నుంచి చెప్పకుండా బయటకు వెళ్లారని, వారి ఆచూకీ తెలియడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు సీఐ సురేష్ తెలిపారు.
పోలీసుల అదుపులో
చోరీ నిందితుడు?
ఇల్లెందు: సింగరేణి ఇల్లెందు ఏరియాలో పలు ఇళ్లల్లో బంగారు ఆభరణాలు చోరీ చేసిన వ్యక్తిని పోలీసులు మూడు రోజుల క్రితం అదుపులోకి తీసున్నట్లు సమాచారం. విచారణలో నేరాలను అంగీకరించినట్లు తెలిసింది. మూడు కిలోల బంగారు, వెండి ఆభరణాలు రికవరీ చేసినట్లు కూడా ప్రచారం సాగుతోంది. చోరీ సొత్తును ఇల్లెందు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ పట్టణాల్లో బంగారు దుకాణాల్లో విక్రయించినట్లు విచారణలో తెలపగా, పోలీసులు కూపీ లాగుతున్నట్లు తెలిసింది. అయితే చోరీల ఘటనలకు సంబంధించి ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు పోలీసుల అదుపులో ఉన్నట్లు, ఒకటి రెండు రోజుల్లో వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.


