భద్రాచలం/చుంచుపల్లి: జిల్లాలో వీబీ జీ రామ్‌జీ పథకం ద్వారా గ్రామీణ ఉపాధి అవకాశాలను పెంచడంతోపాటు, పశుగ్రాసం సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె వివిధ జిల్లాల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. గ్రామాల్లో వలసలను నివారించేందుకు స్థానికంగా ఉపాధి పనులు గుర్తించి చేపట్టాలని సూచించారు. సీసీ రోడ్లు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామపంచాయతీ భవనాలు, నీటి కుంటలు, చెక్‌డ్యాంల నిర్మాణాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. చెరువులు, కాలువల్లో పూడికతీతతో పాటు భూగర్భ జలాల సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. భద్రాచలం ఐటీడీఏ నుంచి పీఓ, కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ విద్యాచందన హాజరై మాట్లాడారు. జిల్లాలో చెరువులు, కాలువల్లో పూడిక తొలగింపు, వివిధ అభివృద్ధి పనుల పూర్తి, కూలీలకు పనిదినాల పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జెడ్పీ సీఈఓ నాగలక్ష్మీ, అదనపు డీఆర్డీఓ రవి, డీఏఓ బాబూరావు, ఏపీఓ డేవిడ్‌రాజు తదితరులు పాల్గొన్నారు.


