ఒకరు ఆస్పత్రికి.. మరొకరు జైలుకు.. | - | Sakshi
Sakshi News home page

ఒకరు ఆస్పత్రికి.. మరొకరు జైలుకు..

Oct 27 2026 12:26 AM | Updated on Oct 27 2026 12:26 AM

ప్రమాదానికి దారితీసిన ఆర్టీసీ బస్సులో చిల్లర వివాదం ఇబ్బందులుపాలు కానున్న రెండు కుటుంబాలు చిల్లర, సీట్ల విషయంలో ప్రయాణికులు, కండక్టర్ల మధ్య తరచూ వాగ్వాదం

మహిళా ప్రయాణికురాలు రిమాండ్‌

అశ్వాపురం: మండల పరిధిలోని మిట్టగూడెం వద్ద ఆర్టీసీ బస్సులో చోటుచేసుకున్న ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. చిల్లర వివాదం ప్రమాదానికి దారితీసిన విషయం విదితమే. ఈ ఘటనలో గాయపడ్డ ఆర్టీసీ కండక్టర్‌ ప్రవళిక తార్నాక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కండక్టర్‌ను బస్సులో నుంచి తోసేసిన ప్రయాణికురాలు, మిట్టగూడేనికి చెందిన మౌనికను పోలీసులు అరెస్ట్‌ రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనతో రెండు కుటుంబాలు ఇబ్బందుల్లో పడ్డాయి.

ప్రయాణికులకు, కండక్టర్లకు మధ్య వాగ్వాదం

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పి స్తున్న మహాలక్ష్మి పథకం అమలులో కొన్ని సందర్భాల్లో కండక్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే చర్చ సాగుతోంది. ఉచిత ప్రయాణ టికెట్ల జారీ, చిల్లర సమస్యలు, సీట్ల కేటాయింపు వంటి అంశాలు ప్రయాణికులు, కండక్టర్ల మధ్య వాగ్వాదాలకు దారితీస్తున్నాయి. బస్సుల్లో రద్దీ పెరిగిన సమయంలో సీట్ల కోసం ప్రయాణికుల మధ్య తలెత్తే వివాదా లను సర్దుబాటు చేయడం కండక్టర్లకు భారంగా మారుతోంది. కొన్నిసార్లు మాటామాట పెరిగి ఘర్షణలకు దారితీస్తోంది. కొన్నిసార్లు ప్రయాణికుల మధ్య కూడా వాగ్వాదం జరుగుతోంది. కండక్టర్లపై పని ఒత్తిడి తగ్గించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ప్రయాణికులు కూడా కండక్టర్లతో ఓర్పుగా, మర్యాదగా వ్యవహరించాలని, సీట్ల విషయంలో పరస్పర సహకారం పాటించాలని సూచిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యం, సిబ్బంది భద్రత రెండింటికీ ప్రాధాన్యం ఇస్తూ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.

సమస్యలకు పరిష్కార సూచనలు

● ఉచిత ప్రయాణానికి సంబంధించిన నిబంధనలను బస్సుల్లో, బస్టాండ్లలో స్పష్టంగా ప్రదర్శించాలి. టికెట్ల జారీ విధానంపై ప్రయాణికులకు అవగాహన కల్పించాలి.

● చిల్లర కారణంగా వాగ్వాదాలు జరగకుండా నగదు చెల్లింపుల విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలి. సాధ్యమైన చోట డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించాలి.

● మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు తదితరులకు సంబంధించిన సీట్ల నిబంధనలను బస్సుల్లో స్పష్టంగా ప్రదర్శించాలి.

● ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే మార్గాలు, సమయాలను గుర్తించి అవసరమైన చోట అదనపు బస్సులను నడపాలి.

● ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించడం, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడం వంటి అంశాలపై ఆర్టీసీ సిబ్బందికి శిక్షణ ఇవ్వా లి. విధి నిర్వహణలో దురుసు ప్రవర్తన లేదా బెదిరింపులు ఎదురైతే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి.

● ప్రయాణికులు, కండక్టర్లు తమ సమస్యలను తెలియజేసేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్‌ లేదా ఫిర్యాదు వ్యవస్థను అందుబాటులోకి తేవాలి. ఫిర్యాదులపై అధికారులు సకాలంలో స్పందించాలి.

● రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో అవసరాన్ని బట్టి అదనపు సిబ్బందిని నియమించాలి.

● మహిళలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పిస్తూనే కండక్టర్ల గౌరవం, భద్రత, పని పరిస్థితులను కాపాడే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

అశ్వాపురం: మండల పరిధిలోని మిట్టగూడెం వద్ద ఆర్టీసీ బస్సులో ఆదివారం జరిగిన వివాదంలో ప్రయాణికురాలు బాణోత్‌ మౌనికను సోమవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసుల కథనం ప్రకా రం.. ఆర్టీసీ బస్సులో టికెట్‌ తీసుకునే విషయంలో ఆమె కండక్టర్‌ ప్రవళికతో గొడవపడింది. బస్సులో నుంచి నెట్టివేయగా కండక్టర్‌ కిందపడింది. బస్సు టైరు ఎక్కి రెండు కాళ్లు విరిగాయి. ఈ ఘటనపై బస్సు డ్రైవర్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమో దు చేసి నిందితురాలు మౌనికను అరెస్టు చేశారు. మణుగూరు కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించడంతో భద్రాచలం సబ్‌ జైలుకు తరలించారు. ఈ కార్యక్రమంలో సీఐ ఎల్లయ్య, ఎస్సై శాంతి, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement