పాల్వంచ: ఢిల్లీలో సోమవారం జరిగిన డీఏవీ పాఠశాలల జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్వంచ స్కూల్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థిని మహమ్మద్ ఫైస్తా సుమయ్య రైఫిల్ షూటింగ్‌లో ప్రతిభ కనబర్చింది. 10 మీటర్ల ఓపెన్ సైట్ రైఫిల్ షూటింగ్ విభాగంలో రజత పతకం సాధించింది. ఈ సందర్భంగా జిల్లా యువజన క్రీడల అధికారి ఎం.పరంధామ రెడ్డి విద్యార్థిని అభినందించారు. కోచ్ అబ్దుల్ నబీ హర్షం వ్యక్తం చేశారు.
పత్తి చేనులోకి
దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
కూసుమంచి: ఖమ్మం – సూర్యాపేట జాతీయ రహదారిపై వెళ్తున్న ఆర్‌టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే పత్తి చేనులోకి దూసుకెళ్లింది. సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు... భద్రాచలం డిపోనకు చెందిన డీలక్స్ బస్సు హైదరాబాద్ నుండి భద్రాచలం వెళ్తుండగా జాతీయ రహహదారిపై లింగారంతండా వద్ద అదుపు తప్పింది. దీంతో బస్సు రోడ్డు దిగి పక్కనే ఉన్న పత్తి చేనులోకి దూసుకెళ్లింది. ఈ సమయాన కొందరే ప్రయాణికులు ఉండడం, వారు స్వల్ప గాయాలతో బయట పడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక పోలీసులు, హైవే సిబ్బంది చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా, బస్సు అతివేగం, డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.
ప్రమాద స్థలాన్ని
పరిశీలించిన డీఎస్పీ
మణుగూరు టౌన్: భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో రెండు రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో సిస్కాన్ కంపెనీకి చెందిన కాంట్రాక్ట్ కార్మికుడు ధశ్వన్ కుమ్రే మృతి చెందిన విషయం విదితమే. సోమవారం మణుగూరు డీఎస్పీ వి.రవీంద్రారెడ్డి ఘటనా స్థలాన్ని పరి శీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో బీటీపీఎస్ సీఈ బి.బిచ్చన్న, మణుగూరు సీఐ నాగబాబు పాల్గొన్నారు.
అనధికార దత్తతపై
కేసు నమోదు
టేకులపల్లిరూరల్: పేదరికంతో సతమతమవుతున్న ఆ తల్లి కన్నపేగు బంధాన్ని వదిలించుకునే ప్రయత్నం చేసింది. అనధికారికంగా రెండు నెలల పాపను దత్తత ఇచ్చింది. విషయం వెలుగుచూడటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని రామచంద్రునిపేట గ్రామానికి చెందిన మహిళ గత ఆగస్టు నెలలో పాపకు జన్మిచ్చింది. పేదరికం కారణంగా పాపను పోషించే స్థోమత లేక లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డకు చెందిన దంపతులకు దత్తత ఇచ్చింది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు బోడు ఎస్‌ఐ రాజమౌళి తెలిపారు.


