అశ్వారావుపేటరూరల్: ఆరుగాలం శ్రమించి పంటను సాగు చేసిన ఓ మహిళా రైతుకు తీరని నష్టం వాటిల్లింది. పంట చేతికొచ్చే వేళ గుర్తుతెలియని దుండగులు కలుపుమందు పిచికారీ చేయడంతో పెట్టుబడి నష్టపోయిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కథనం ప్రకారం.. మండలంలోని మల్లాయిగూడేనికి చెందిన నారం ముత్తమ్మ నారాయణపురం రెవెన్యూ పరిధిలోని ఐదెకరాల్లో మినుము పంట సాగు చేపట్టింది. శనివారం పంటకు నీళ్లు పెట్టి సాయంత్రానికి ఇంటికి వచ్చింది. తిరిగి ఆదివారం ఉదయం వెళ్లి చూసేసరికి పంట అంతా ఎండిపోయి ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు కలుపు మందు పిచికారీ చేశారని, అందుకే పచ్చని చేను పూర్తిగా మాడిపోయిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. రూ.2 లక్షల నష్టం వాటిల్లినట్లు వాపోయింది. కాగా, ఈ వ్యవసాయ భూమికి సంబంధించి కొంతకాలంగా ఇదే గ్రామానికి చెందిన ఇరువర్గాల మధ్య వివాదం సాగుతోంది. ఈ క్రమంలోనే అర్ధరాత్రి సమయంలో పొలానికి సదరు వ్యక్తులు కలుపు మందు కొట్టి ఉంటారనే అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనపై విచారణ చేసిన న్యాయం చేయాలని బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది.
బాధిత మహిళా రైతుకు రూ.2 లక్షల నష్టం


