కిన్నెరసానిలో నిర్మించిన అద్దాలమేడ అలంకారప్రాయంగా మారింది. ఎకో టూరిజం అభివృద్ధిలో భాగంగా 2015లో కేంద్ర ప్రభుత్వం రూ.3.34 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.7.53 కోట్లు మంజూరు చేశాయి. వీటితో కాటేజీలు, హరిత హోటల్, అద్దాలమేడ నిర్మించారు. నిర్మాణం పూర్తయినా అద్దాలమేడను వినియోగంలోకి తేవడంలేదు. అద్దాల మేడ, కాటేజీల నిర్వహణ కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు అటవీశాఖ టెండర్లు పిలిచింది. ఎవరూ ముందుకు రాకపోవడంతో వాటిని ప్రారంభించడంలో జాప్యం జరుగుతోంది. అద్దాలమేడ వైపు వెళ్లే మార్గంలో గేటు ఏర్పాటుచేసి పర్యాటకులు వెళ్లకుండా మూసివేశారు. ఉన్నతాధికారులు స్పందించి అద్దాలమేడను వీక్షించేలా చర్యలు చేపట్టాలని పర్యాటకులు కోరుతున్నారు.


