ఖమ్మంగాంధీచౌక్: తెలంగాణ సాహితి ఆధ్వర్యాన శని, ఆదివారాల్లో నాగార్జునసాగర్ బుద్ధవనంలో నిర్వహించిన యూత్ లిటరరీ ఫెస్ట్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు ప్రతిభ కనబరిచారు. కథాచర్చలో ఆనం ఆశ్రితారెడ్డి, పెద్దపల్లి తేజస్వి, నాల్లా భానుచందర్ పాల్గొనగా, కవిత్వ చర్చ, గానంలో సాధన తేరాల, హిమాంశుక(ఇల్లెందు), సాయి కుమారి, రాజ్యలక్ష్మి, దుర్గాచారి(భద్రాచలం) పాల్గొని ప్రతిభ చాటారు. వీరికి తెలంగాణ సాహితి జిల్లా కన్వీనర్ కటుకోఝ్వల రమేష్ సమన్వయకర్తగా వ్యవహరించారు.
నేటి నుంచి విపత్తు
నిర్వహణపై శిక్షణ
జిల్లా నుంచి ఎనిమిది మంది
అధికారుల ఎంపిక
భద్రాచలంఅర్బన్: తుపానుల సమయంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, విపత్తుల ప్రభావాన్ని తగ్గించే చర్యలపై సోమవారం నుంచి మూడు రోజులపాటు శిక్షణ నిర్వహించనున్నారు. విజయవాడలోని జాతీ య విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌ఐడీఎం) దక్షిణ ప్రాంత క్యాంపస్‌లో జరిగే శిక్షణకు జిల్లా నుంచి ఎనిమిది మంది అధికారులను ఎంపిక చేశారు. శిక్షణ ఎంపికై నవారిలో జిల్లా పరిషత్ సీఈఓ బి.నాగలక్ష్మి, ఇల్లెందు అగ్నిమాపక అధికారి ఎం.నవీన్, నీటిపారుదల శాఖ ఎస్‌ఈ కె.మహేశ్వరరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి శివప్రసాద్, వ్యవసాయశాఖ సాంకేతిక అధికారి కె.విజయభాస్కర్‌రెడ్డి, మణుగూరు మున్సిపల్ కమిషనర్ టి.ప్రసాదరావు, బూర్గంపాడు ఎంపీఓ బి.రామకృష్ణ, భద్రాచలం గ్రామపంచాయతీ అధికారి సీహెచ్.శ్రీనివాస్ ఉన్నారు.
గ్యాస్ గోదాం మేనేజర్ ఆత్మహత్య కేసులో
కీలక మలుపు
పోలీసుల అదుపులో
ఆరుగురు నిందితులు?
భద్రాచలంఅర్బన్: పాల్వంచ గ్యాస్ గోదాం మేనేజర్ అనంతుల లకీ్‌ష్మ్‌నారాయణ ఆత్మహత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఓ మహిళతో పాటు ఇద్దరు జర్నలిస్టులను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో, మరో ముగ్గురు జర్నలిస్టులను తమిళనాడు రాష్ట్రంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఘటన జరిగిన వారం రోజుల తర్వాత నిందితుల ఆచూకీ గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయమై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
పంచాయతీ కార్యదర్శిని బెదిరించిన విలేకరిపై కేసు
భద్రాచలంఅర్బన్: డబ్బుల కోసం పంచాయతీ కార్యదర్శిని బెదిరించిన ఆరోపణలపై వై–7 న్యూస్ ఛానల్ విలేకరి తమ్మళ్ల రాజేష్‌పై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. బాధితుడి ఫిర్యాదు ప్రకారం.. భద్రాచలం గ్రామపంచాయతీలో గ్రేడ్–1 కార్యదర్శిగా పని చేస్తున్న శ్రీనివాసరావును పట్టణంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాల నుంచి డబ్బులు వసూలు చేసి ఇవ్వాలని రాజేష్ డిమాండ్ చేశా రు. ఇందుకు శ్రీనివాసరావు నిరాకరించడంతో ఆయనను కించపరిచేలా వార్తలు రాయడంతో పాటు ఫోన్‌లోదూషించి, బెదిరింపులకు పాల్ప డినట్లు ఆరోపించారు. డబ్బులు ఇవ్వకుంటే మరిన్ని వార్తలు ప్రచారం చేస్తానని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొనగా.. రాజేష్‌పై ఎస్‌ఐ సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్..
యువకుడు మృతి
దమ్మపేట: ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి బైక్‌తో ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండల పరిధి లోని ముష్టిబండ గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన ముళ్లగిరి సుధీర్(18) మండలంలోని వడ్లగూడెం గ్రామానికి చెందిన తన సమీప బంధువు సుందరంతో కలిసి బైక్‌పై అదే గ్రామం నుంచి దమ్మపేట వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో ముష్టిబండలో ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సుధీర్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సుందరం గాయపడగా చికిత్స నిమిత్తం దమ్మపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
పురుగుల మందు తాగిన వ్యక్తి..
పెనుబల్లి: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మండలంలోని భవన్నపాలెం గ్రామానికి చెందిన పాశ్యం వెంకటేశ్వరావు(63) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈమేరకు శనివారం అర్ధరాత్రి ఆయన పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనపై ఆయన కుటుంబీకులు ఫిర్యాదుతో ఆదివారం కేసు నమోదు చేసినట్లు వీఎం.బంజర్ ఎస్‌ఐ షాకీర్ తెలిపారు.


