పుష్కరాలకు ‘ప్రసాద్‌’ం అందేనా? | - | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు ‘ప్రసాద్‌’ం అందేనా?

Oct 25 2026 12:35 AM | Updated on Oct 25 2026 12:35 AM

● భద్రగిరిలో నత్తనడకన ప్రసాద్‌ పథకం పనులు ● ఏళ్లుగా సాగుతున్న వసతి భవన నిర్మాణం ● సిద్ధమైన రెస్టారెంట్‌ను దేవస్థానానికి అప్పగించని టూరిజం శాఖ ● మరోవైపు సమీపిస్తున్న గోదావరి పుష్కరాల తరుణం

అనుమతులు రాగానే అప్పగిస్తాం

● భద్రగిరిలో నత్తనడకన ప్రసాద్‌ పథకం పనులు ● ఏళ్లుగా సాగుతున్న వసతి భవన నిర్మాణం ● సిద్ధమైన రెస్టారెంట్‌ను దేవస్థానానికి అప్పగించని టూరిజం శాఖ ● మరోవైపు సమీపిస్తున్న గోదావరి పుష్కరాల తరుణం

భద్రాచలం: వచ్చే ఏడాది జూన్‌లో గోదావరి పుష్కరాలు నిర్వహించనున్నారు. అంతకుముందు వచ్చే శ్రీరామనవమికి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. వారికి ఎప్పటిలాగే వసతి కష్టాలు తప్పేలా లేవు. భద్రగిరిలో భక్తుల సౌకర్యాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రసాద్‌ పథకం పనులు చేపట్టినా నత్తనడకన సాగుతున్నాయి. పూర్తయిన నిర్మాణాలను దేవస్థానానికి అప్పగించడంలోనూ పర్యాటక శాఖ అధికారులు జాప్యం చేస్తున్నారు.

నిర్మాణం పూర్తయినా అప్పగించని రెస్టారెంట్‌

భద్రాచలానికి దసరా, సంక్రాంతి సెలవులతోపాటు ముక్కోటి, శ్రీరామనవమి పర్వదినాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. ఇటీవల దసరా సెలవుల్లోనూ భక్తుల రద్దీ విపరీతంగా కనిపించింది. హోటళ్లు, రెస్టారెంట్లు కిక్కిరిసిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో బ్రిడ్జి సమీపంలో ప్రసాద్‌ పథకంలో భాగంగా నిర్మించిన టూరిజం రెస్టారెంట్‌ అందుబాటులో ఉంటే భక్తులకు కొంతమేర ఉపశమనం లభించేది. ఆధునిక రెస్టారెంట్లను తలపించేలా విశాలమైన హాళ్లు, లైటింగ్‌, వాహనాల పార్కింగ్‌ సదుపాయాలతో రెండు నెలల క్రితమే నిర్మాణం పూర్తి చేశారు. కానీ ప్రారంభించడంలేదు. టూరిజం శాఖ అధికారులు రెస్టారెంట్‌ను అప్పగిస్తే, రామాలయ అధికారులు టెండర్లు నిర్వహించి ప్రైవేట్‌ వ్యక్తులకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది. ఉన్నతాధికారుల నుంచి అనుమతి రాకపోవడంతో అప్పగింతలో జాప్యం జరుగుతోంది. దీనిపై దేవస్థానం అధికారులు టూరిజం ఉన్నతాధికారులకు లేఖ రాసినా స్పందన లేదని తెలుస్తోంది.

ఏళ్లుగా సాగుతున్న వసతి భవనం నిర్మాణం

మిథిలా స్టేడియం వెనుక భాగంలో సుమారు రెండు ఎకరాల స్థలంలో చేపట్టిన జీ ప్లస్‌ వన్‌ భవన నిర్మాణం ఏళ్లుగా కొనసాగుతోంది. ప్రసాద్‌ పథకంలో భాగంగా ఈ పనులు చేపట్టారు. నిత్యాన్నదానానికి అన్నప్రసాద మండపంతోపాటు భక్తుల కోసం వసతి గదులు నిర్మిస్తున్నారు. తొలుత 2024 జూలై 30 నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. అనంతరం డిసెంబర్‌కు, ఆ తర్వాత 2025 జూన్‌ వరకు గడువు పొడిగించారు. అయినా పనులు పూర్తి కాకపోవడంతో మరోసారి గడువు పెంచాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో నిత్యాన్నదానం వద్ద భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీ ప్లస్‌ వన్‌ భవన నిర్మాణం పూర్తయితే అన్నప్రసాద పంపిణీతోపాటు వసతి సమస్యకూ కొంతమేర పరిష్కారం లభించే అవకాశం ఉంది.

రెస్టారెంట్‌ పూర్తిగా సిద్ధమైంది. దేవస్థానానికి అప్పగించేందుకు ఉన్నతాధికారుల నుంచి అనుమతి పత్రాలు అందాల్సి ఉంది. అవి అందగానే దేవస్థానం ఇంజనీరింగ్‌ శాఖకు అప్పగిస్తాం. జీ ప్లస్‌ వన్‌్‌ భవన నిర్మాణానికి ఆటంకాలు తొలగడంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. నూతన సంవత్సరంలో భవనాన్ని భక్తులకు అందుబాటులోకి తెచ్చేలా కృషి చేస్తున్నాం.

–నిమ్మల రామకృష్ణ, డీఈ, టూరిజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement