అంజనాపురంలో భారీ చోరీ | - | Sakshi
Sakshi News home page

అంజనాపురంలో భారీ చోరీ

Oct 25 2026 12:35 AM | Updated on Oct 25 2026 12:35 AM

బూర్గంపాడు: మండల పరిధిలోని అంజనాపురంలో శనివారం భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన లకావత్‌ బాల్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాలో ఉన్న సుమారు 8 తులాల బంగారు నగలు, వెండి వస్తువులు, కొంత నగదు అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

ఐటీసీ కార్మికుడి ఇంట్లో..

భద్రాచలంఅర్బన్‌: ఐటీసీ క్యాజువల్‌ కార్మికుడి ఇంట్లో చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆదర్శ నగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న ఐటీసీ కార్మికుడు పుట్టి రాజు ఈ నెల 20న ఉదయం ఊరెళ్లాడు. తిరిగి మధ్యాహ్నం వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న 35 గ్రాముల బంగారు ఆభరణాలు, 60 గ్రాముల వెండి గొలుసులు అపహరించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శనివారం నిందితుడు, అదే ప్రాంతానికి చెందిన కొండేటి భార్గవ్‌ను అరెస్ట్‌ చేశారు.

పురుగుల మందు తాగి ఆత్మహత్య

చర్ల: మద్యం మత్తులో పురుగుల మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఎస్సై ఆర్‌ నర్సిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గొంపల్లికి చెందిన గౌర్ల రమేష్‌ (48) మద్యం మత్తులో ఈ నెల 22న ఇంటి వద్దనే పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తుండగా శనివారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

భవనం పైనుంచి పడి..

బెంగాల్‌ కార్మికుడి మృతి

కొత్తగూడెంఅర్బన్‌: నిర్మాణ దశలో ఉన్న మూడు అంతస్తుల భవనం పైనుంచి పడి ఓ కార్మికుడు మృతి చెందిన ఘటన శనివారం జరిగింది. కొత్తగూడెం త్రీటౌన్‌ పోలీసుల కథనం ప్రకారం.. బెంగాల్‌కు చెందిన నిత్యానందసర్కార్‌(26) కొన్ని నెలల క్రితం కొత్తగూడేనికి వలస వచ్చాడు. భవన నిర్మాణ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం మేదరబస్తీలోనే నిర్మాణంలో ఉన్న మూడు అంతస్తుల భవనంపై పని చేస్తున్నాడు. ఈ క్రమంలో పరంజాను పట్టుకునే క్రమంలో కాలు జారి కిందపడి మృతి చెందాడు. మృతుడి బాబాయి బిష్ణు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.

పల్టీ కొట్టిన కారు : ఐదుగురికి గాయాలు

ఏన్కూరు: మండలంలోని భగవాన్‌ నాయక్‌ తండా సమీపాన శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన రాజశేఖర్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో ఏన్కూరు మీదుగా పాల్వంచ వెళ్తున్నారు. భగవాన్‌నాయక్‌ తండా సమీపాన గుంతను తప్పించే క్రమాన కారు అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఘటనలో ఐదుగురికి గాయాలు కాగా ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement