వెట్టి చాకిరి నిర్మూలించాలి | - | Sakshi
Sakshi News home page

వెట్టి చాకిరి నిర్మూలించాలి

Oct 24 2026 5:05 AM | Updated on Oct 24 2026 5:05 AM

అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): సమాజంలో కొనసాగుతున్న వెట్టి చాకిరి, బానిసత్వం వంటి అమానవీయ దురా చారాలను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్‌ డి.వేణుగోపాల్‌ పిలుపునిచ్చారు. వెట్టి చాకిరి నిర్మూలనపై కార్మిక శాఖ రూపొందించిన వాల్‌ పోస్టర్లను శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయన ఆవిష్కరించారు. అనంతరం అసంఘటిత రంగ కార్మికులకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘స్వేచ్ఛా ధనం’రాష్ట్రవ్యాప్త అవగాహన కార్యక్రమం ద్వారా వెట్టి చాకిరి నిర్మూలన, బాధితుల గుర్తింపు, పునరావాసం, హక్కులపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. జిల్లా సహాయ కార్మిక కమిషనర్‌ శ్యామల ప్రమోద్‌ కుమార్‌, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి కె శ్రీరామ్‌, ఇతర అధికారులు బి.నాగరాజు, పీవీకే శాస్త్రి, ఎ.యేసుపాదం, రజిత తదితరులు పాల్గొన్నారు.

భూ రీ సర్వే వేగవంతం

చండ్రుగొండ : జిల్లాలో భూ రీసర్వే వేగవంతంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌ తెలిపారు. మండలంలోని సీతాయిగూడెం గ్రామంలో జరుగుతున్న భూ రీసర్వే ప్రక్రియను శుక్రవారం ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. సర్వే ల్యాండ్స్‌ ఏడీ శ్రీనివాసరావు, డీటీ హైందవి, ఆర్‌ఐ తిరుపతిరావు పాల్గొన్నారు.

అంతర పంటగా కోకో సాగు చేయాలి

కొబ్బరి అభివృద్ధి బోర్డు డీఓ శరత్‌

అశ్వారావుపేటరూరల్‌: కొబ్బరి, పామాయిల్‌ తోటల్లో రైతులు అంతర పంటగా కోకోను సాగు చేసి అదనపు ఆదాయాన్ని పొందాలని కొబ్బరి అభివృద్ధి బోర్డు డీఓ(డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌) హెచ్‌ఎన్‌ శరత్‌ సూచించారు. శుక్రవారం కొబ్బరి క్షేత్రంలో రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. రాయితీ పథకాలను సద్వినియోగం చేసుకుని, కొబ్బరి తోటల సాగును మరింత విస్తరించాలని అన్నారు. అనంతరం పలువురు రైతులు మాట్లాడుతూ పొటాష్‌తోపాటు వేప పిండి, లింగాకర్షక బుట్టలను సరఫరా చేయాలని, కోకో మొక్కల నర్సరీ స్థానికంగా ఏర్పాటు చేసి, రాయితీపై మొక్కలను అందించాలని కోరారు. ఆత్మ కమిటీ చైర్మన్‌ ఎస్‌ వీరభద్రరావు, రైతు సంఘం నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య, హెచ్‌ఈఓ ఈశ్వర్‌, శీమకుర్తి వెంకటేశ్వరరావు, తలశిల ప్రసాద్‌ పాల్గొన్నారు.

పుష్కరాల ఏర్పాట్లు పూర్తి చేయాలి

సౌత్‌ సెంట్రల్‌ రైల్వే డీఆర్‌ఎం గోపాలకృష్ణన్‌

కొత్తగూడెంఅర్బన్‌: భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్‌లో చేపడుతున్న పుష్కరాలు పనులు, ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే డీఆర్‌ఎం గోపాలకృష్ణన్‌ అన్నారు. శుక్రవారం స్పెషల్‌ ట్రైన్‌లో వచ్చిన ఆయన గోదావరి పుష్కరాల నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పనుల్లో నాణ్యత పాటించాలని ఆదేశించారు. పుష్కరాలకు భద్రాచలం వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా భారీ షెడ్లను ఏర్పాటు చేస్తున్నామని, రైల్వే స్టేషన్‌లోనే ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండేలా చూస్తామని వివరించారు. అనంతరం డీఆర్‌యూసీసీ మెంబర్లు వై.శ్రీనివాస్‌రెడ్డి, భీమా శ్రీధర్‌ వేర్వేరుగా వినతిపత్రాలు అందజేశారు. తిరుపతికి, షిరిడికి ప్రత్యేక రైళ్లు నడపాలని, గతంలో రద్దు చేసిన కొల్హాపూర్‌, కాజీపేట, డోర్నకల్‌ రైళ్లను తిరిగి నడిపించాలని కోరారు. సింగరేణి రైలులో సౌకర్యాలు కల్పించాలని, కరీంనగర్‌–తిరుపతి సూపర్‌ ఫాస్ట్‌ రైలుకు డోర్నకల్‌లో స్టాప్‌ ఏర్పాటు చేయాలని, సత్తుపల్లికి ప్యాసింజర్‌ రైలు ఏర్పాటు చేయాలని చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. వందనపు సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement