సింగరేణిపై విస్తరణ భారం! | - | Sakshi
Sakshi News home page

సింగరేణిపై విస్తరణ భారం!

Oct 24 2026 4:53 AM | Updated on Oct 24 2026 4:53 AM

పెరిగిన నిర్వాసితుల సంఖ్య

ఓసీ విస్తరణ భూ సేకరణలో

భారీగా పెరిగిన నిర్వాసితులు

పక్క జిల్లావాసులు 1,2 కుంటల్లో

వ్యవసాయం చేస్తున్నట్లు రికార్డులు

రెవెన్యూ అధికారుల

వ్యవహారశైలిపై విమర్శలు

మణుగూరు టౌన్‌: రెవెన్యూ అధికారుల తీరుతో మణుగూరు ఓసీ విస్తరణ అపహాస్యమవుతోంది. విస్తరణకు మూడు గ్రామాల్లో సుమారు 813 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరిస్తున్నారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీల పేరిట దళారుల చేతివాటానికి రెవెన్యూ అధికారుల సహకారం తోడవడంతో అనర్హుల పేర్లు కూడా జాబితాలో వచ్చాయి. దీంతో సింగరేణిపై పరిహారం భారం పెరగనుంది. మణుగూ రు ఓసీలో బొగ్గు నిల్వలు అడుగంటుతుండటంతో యాజమాన్యం విస్తరణకు చర్యలు చేపట్టింది. 37 మిలియన్‌ టన్నుల నిల్వలను గుర్తించి 2026–27లో ఉత్పత్తి ప్రారంభించాలని భావించింది. కానీ క్షేత్రస్థాయి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

రూ.437 కోట్లు కేటాయింపు..

ఓసీ విస్తరణ అనంతరం వచ్చే జీ–13, 15, 9 గ్రేడ్‌ బొగ్గును కేవలం బీటీపీఎస్‌కు మాత్రమే కేటాయించాలి. బహిరంగ మార్కెట్‌లో రూ. 609 అదనంగా అందించేందుకు ఎంఓయూ కుదరగా, ప్రస్తుతం మణుగూరు ఓసీ విస్తరణలో భూ సేకరణ ప్రక్రియ జరుగుతోంది. ఈ క్రమంలో భూములు తీసుకునే రైతులకు పరిహారం కింద రూ.160 కోట్లు, సర్వే, ఇతర వ్యవహారాలకు మొత్తం కలిపి రూ.437 కోట్లు కేటాయించింది. తాజాగా వెలువడిన నిర్వాసితులజాబితాలో ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అందుకునే వారి సంఖ్య పెరిగింది. దీంతో చెల్లింపులు ఇంకారూ. కోట్లలో పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఓసీ విస్తరణ భవిష్యత్‌ 20 సంవత్సరాలు ఉంది. భూ సేకరణ ప్రతిపాదనల ప్రారంభ దశలో అధికా రుల సంయుక్త సమావేశంలో తిర్లాపురం, రామానుజవరం, మణుగూరు గ్రామా ల రికార్డులను అనుసరించి పహణీ, తదితర అంశాల ప్రాతిపదికన నిర్వాసితులు 400 మంది నుంచి 500 వరకు ఉండే అవకాశం ఉందని అధికారులు భావించారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో ప్రస్తుతం వారి సంఖ్య 1380కి చేరింది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఫలితంగా ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలు అందుకునే నిర్వాసితులు పెరిగి సింగరేణిపై ఆర్థిక భాగం పెరిగి మణుగూరు ఓసీలో ఉత్పత్తి వ్యయం పెరిగి లాభసాటిగా ఉండదు అన్న భావన సింగరేణి అధికారుల్లో చర్చనీ యాంశంగా మారినట్లు సమాచారం. పక్క జిల్లావా సులు ఇక్కడ 1 నుంచి 10 కుంటల భూమి విస్తీర్ణంలో వ్యవసాయం చేసినట్లు రెవెన్యూ అధికారులు రికార్డులు చూపుతున్నారు. క్షేత్రస్థాయి విచారణ అనంతరం పబ్లిక్‌ నోటీస్‌లో కూడా అదే విషయం పేర్కొనడం గమనార్హం. ఈ విషయమై మణుగూరు తహసీల్దార్‌ అద్దంకి నరేష్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement