భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో స్వామివారి నిత్యకల్యాణం వైభవోపేతంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మిథిలా స్టేడియంలోని రామసేవా మండపంలో స్వామివారి నిత్యకల్యాణ మూర్తులను కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
రామయ్య సన్నిధిలో త్రిదండి జీయర్‌స్వామి
శ్రీ సీతారామ చంద్రస్వామి వారిని శుక్రవారం త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి దర్శించుకున్నారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకున్నారు. పండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆలయ ఏఈవో శ్రావన్‌కుమార్, అర్చకులు, పండితులు పాల్గొన్నారు.
శాశ్వత నిత్యాన్నదానానికి విరాళం
శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి బెంగళూరుకు చెందిన భక్తుడు పి.కిషోర్ రూ. 1.5 లక్షల విరాళం అందించాడు. దాతకు అధికారులు రశీదు అందజేశారు. ఆలయ పర్యవేక్షకుడు లింగాల సాయిబాబు, అర్చకులు పాల్గొన్నారు.
26న శబరి స్మృతి యాత్ర
దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 26న అశ్వయుజ పూర్ణిమ సందర్భంగా శబరి స్మృతి యాత్ర నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ దామోదర్‌రావు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 గంటలకు శబరి చిత్రపటంతో గిరి ప్రదక్షిణ, ప్రత్యేక పూజలు, ప్రచార రథంతో శోభాయాత్ర, నిత్యకల్యాణోత్సవాలు, అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాలు జరపనున్నట్లు పేర్కొన్నారు.


