మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

Oct 24 2026 4:53 AM | Updated on Oct 24 2026 4:53 AM

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన ఘటనలో డ్రైవర్‌పై కేసు నమోదు ఐదు పశువులు స్వాధీనం కాపర్‌ వైర్‌ చోరీకి విఫలయత్నం

ములకలపల్లి: మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం జరిగింది. ఎస్సై మధుప్రసాద్‌ కథనం ప్రకారం.. మండలంలోని జగన్నాథపురం గ్రామ పంచాయతీ చండ్రకుంట గ్రామానికి చెందిన కొర్సా రాజులు (35) భార్య వెంటకమ్మతో కలిసి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రాజులు కొంతకాలంగా మద్యానికి బానిసై ఏ పనీ చేయకుండా తిరుగుతున్నాడు. శుక్రవారం కూడా అతిగా మద్యం తాగి ఇంటికిరాగా, భార్య కోపగించుకుంది. దీంతో మనస్తాపం చెంది, మద్యంలో పురుగుల మందు కలుపుకుని తాగాడు. పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

టేకులపల్లి: మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్‌ ఎదుట గురువారం రాత్రి వాహనాల తనిఖీ చేపట్టిన కానిస్టేబుల్‌ పులసం రవిని ఇసుక లారీ ఢీకొట్టిన విషయం విదితమే. ఆ తర్వాత ఆటోను ఢీకొట్టగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. దీంతో శుక్రవారం లారీ డ్రైవర్‌ భూక్య గణేష్‌పై కేసు నమోదు చేశారు. రవిని కొత్తగూడెంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఎస్‌ఐ తిరుపతి తెలిపారు. చికిత్స పొందుతున్న కానిస్టేబుల్‌ను శుక్రవారం సీఐ బత్తుల సత్యనారాయణతో కలిసి ఎస్పీ రోహిత్‌రాజు పరామర్శించారు. రూ. 25 వేల ఆర్థికసాయం చేశారు.

భద్రాచలంఅర్బన్‌: అక్రమంగా తరలిస్తున్న ఐదు పశువులను శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. చర్ల నుంచి మోరంపల్లి బంజరకు తరలిస్తుండగా భద్రాచలం బ్రిడ్జి పాయింట్‌ వద్ద స్వాధీనం చేసుకున్నారు. పశువులను పాల్వంచలోని గోశాలకు తరలించి, ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేశారు.

మణుగూరు టౌన్‌: సింగరేణి మణుగూరు ఓసీలో గురువారం అర్ధరాత్రి కొందరు వ్యక్తులు చోరీకి యత్నించగా, ఓసీ స్పెషల్‌ టీం ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. 35 మీటర్ల కేబుల్‌ను స్వాధీనం చేసుకోగా, దొంగలు పరారయ్యారు. గతంలోనూ రెండుసార్లు దొంగతనాలకు యత్నించగా, సెక్యూరిటీ సిబ్బంది చాకచక్యంగా అడ్డుకుని కాపర్‌ చోరీకి గురికాకుండా చర్యలు తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement