చెదిరిపోయిన కలలు | - | Sakshi
Sakshi News home page

చెదిరిపోయిన కలలు

Oct 24 2026 4:53 AM | Updated on Oct 24 2026 4:53 AM

● న్యూయార్క్‌లో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి ● ఇటీవలే ఎంఎస్‌ పూర్తి, వారంలోగా ఉద్యోగానికి.. ● ఇంతలోనే కన్నుమూసిన అక్షిత

● న్యూయార్క్‌లో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి ● ఇటీవలే ఎంఎస్‌ పూర్తి, వారంలోగా ఉద్యోగానికి.. ● ఇంతలోనే కన్నుమూసిన అక్షిత

ఖమ్మంఅర్బన్‌: కుటుంబానికి దూరంగా ఉంటూ ఉన్నత చదువు పూర్తిచేయడమే కాక మంచి ఉద్యోగానికి ఎంపికై ంది. ఇన్నాళ్లు పడిన శ్రమకు ఫలితం దక్కుతుందని ఆ యువతితో పాటు తల్లిదండ్రులు ఆశపడ్డారు. కానీ ఆ విజయాన్ని ఆస్వాదించకుండానే యువతి గుండెపోటుతో కన్నుమూసింది. ఎంఎస్‌ పూర్తి చేసి, మూడు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికై న ఆమె నచ్చిన సంస్థలో త్వరలోనే చేరి జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాల్సిన తరుణంలో మృతి చెందిందన్న సమాచారం తెలియడంతో కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.

నాలుగేళ్ల క్రితం అమెరికాకు...

తిరుమలాయపాలెం మండలం కొక్కిరేణి గ్రామానికి చెందిన నల్లమల ఆనంద్‌–కల్పన దంపతులు ఖమ్మం మమతారోడ్డులో స్థిరపడ్డారు. ఆనంద్‌ వ్యాపారం చేస్తూనే చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఎగుమతుల విభాగం అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా, కల్పన విద్యుత్‌ శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. వీరి కుమార్తె అక్షిత(26) నాలుగేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. ఆతర్వాత ఆమె సోదరుడు అక్షయ్‌ కూడా వెళ్లడంతో న్యూయార్క్‌లోని ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇటీవలే ఎంఎస్‌ పూర్తి చేసిన అక్షిత తాజాగా మూడు కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికై ంది. అందులో నచ్చిన సంస్థను ఎంచుకుని వారం రోజుల్లో విధుల్లో చేరేందుకు సిద్ధమవుతోంది. ఉద్యోగంలో స్థిరపడ్డాక మంచి సంబంధం చూసి వివాహం చేయాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు.

జిమ్‌ నుంచి వచ్చి కుప్పకూలి..

అక్షిత శుక్రవారం తెల్లవారుజామున(భారత కాలమానం ప్రకారం) రోజులాగే వ్యాయామం కోసం జిమ్‌కు వెళ్లి తిరిగి గదికి వచ్చింది. అనంతరం సోదరుడు అక్షయ్‌తో కలిసి పాస్తా తిన్నాక ఆమె నివాస సముదాయం కింద వాకింగ్‌ చేస్తోంది. ఈక్రమాన ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో స్పందించిన సోదరుడు వైద్యులను పిలిపించి సీపీఆర్‌ చేయించినా ఫలితం దక్కలేదు. అప్పటికే ఆమె గుండెపోటుతో ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో సోదరుడు ఖమ్మంలోని తల్లితండ్రులకు సమాచారం ఇవ్వడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

తండ్రితో మాట్లాడిన కొద్దిసేపటికే..

అక్షిత జిమ్‌కు వెళ్లి వచ్చాక తండ్రి ఆనంద్‌తో ఫోన్‌లో మాట్లాడింది. ఆ తర్వాత వాకింగ్‌ వెళ్లిన ఆమె, కాసేపటికి మృతి చెందిందనే సమాచారం తెలియడంతో ఆనంద్‌ – కల్పన దంపతులతో పాటు బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈమేరకు బంధువులు, మిత్రులు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆనంద్‌ దంపతులను ఓదార్చారు. ఉన్నత చదువులు చదివిన కుమార్తె ఉద్యోగం చేస్తూ తమకు అండగా నిలుస్తుందనుకునే తరుణాన దూరమైందంటూ వారు రోదించినట్లు తీరు అందరినీ కంటతడి పెట్టించింది.

స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు

అమెరికా నుంచి అక్షిత మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు మిత్రులు, కుటుంబ సభ్యులు ప్రయత్నాలు ప్రారంభించారు. అమెరికాలోని ‘తానా’ సహకారంతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులను సంప్రదిస్తున్నట్లు వారు తెలిపారు. అక్కడి నిబంధనల ప్రకారం పోస్టుమార్టం, ఇతర అధికారిక ప్రక్రియ పూర్తయ్యాక సోమవారం నాటికి మృతదేహం ఖమ్మం చేరే అవకాశముందని తెలిసింది. కాగా, అక్షిత మృతిపై రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆనంద్‌కు ఫోన్‌ చేసి పరామర్శించారు. అలాగే, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా ఓ ప్రకటనలో సంతాపం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement